ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తున్నారా..? మీ కళ్లను కాపాడుకోవడానికి డాక్టర్లు సలహాలు ఇవే..

ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తున్నారా..? మీ కళ్లను కాపాడుకోవడానికి డాక్టర్లు సలహాలు ఇవే..

ఈ రోజుల్లో ఫోన్లు, లాప్‌టాప్‌లు మన జీవితంలో ఒక  భాగమైపోయాయి.  ఆఫీస్ వర్క్, ఏదైనా పని కోసమో, సరదా కోసమో గంటలు గంటలు  స్క్రీన్ల వైపు చూడటం వల్ల మనకు తెలియకుండానే కళ్లు దెబ్బతింటున్నాయి. కళ్లు ఆరిపోవడం నుండి చిన్న పిల్లల్లో చూపు మందగించడం వరకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి ?

కంటి వైద్య నిపుణుల ప్రకారం, మితిమీరిన స్క్రీన్ వాడకం వల్ల 'డిజిటల్ ఐ స్ట్రెయిన్' అనే సమస్య వస్తుంది. దీనివల్ల కళ్లు ఎర్రబడటం, మంటగా అనిపించడం, చూపు మసకబారడం, పిల్లల్లో చిన్న వయసులోనే కళ్లద్దాలు రావడం ఏర్పడుతుంది.

ఎవరికి ఎంత స్క్రీన్ టైం ఉండాలంటే 
వైద్యుల సూచనల ప్రకారం వయస్సును బట్టి పరిమితులు  ఉండాలి. 2 ఏళ్ల లోపు పిల్లలకి అసలు స్క్రీన్ చూపించకూడదు. 2 నుండి 5 ఏళ్ల పిల్లలు అయితే రోజుకు గంట కంటే తక్కువే ఉండాలి. ఎదిగిన పిల్లలు అయితే రోజుకు రెండు గంటల లోపు ఉండాలి. పెద్దలు అయితే వినోదం, సోషల్ మీడియా, సినిమాల కోసం రోజుకు 2 గంటల కంటే ఎక్కువ టైం  కేటాయించకూడదు. ముఖ్యంగా పడుకునే గంట ముందు ఫోన్ పక్కన పెట్టేయాలి.

 20-20-20 రూల్ 
కంటి కండరాలకు విశ్రాంతి ఇవ్వడానికి ఇది ఒక అద్భుతమైన పద్ధతి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి.. 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును.. కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. స్క్రీన్ టైం పూర్తిగా తగ్గించలేకపోయినా, ఈ జాగ్రత్తలు పాటిస్తే కళ్లు సురక్షితంగా ఉంటాయి.  పని మధ్యలో కళ్లకు కాస్త రెస్ట్ ఇవ్వండి. ఒక స్క్రీన్  నుండి బ్రేక్ తీసుకుని మరో స్క్రీన్ చూడటం అంటే లాప్ టాప్ నుండి ఫోన్ చూడడం  చేయకండి.

 స్క్రీన్ చూస్తున్నప్పుడు మనం కనురెప్పలు వేయడం తగ్గిస్తాం, దీనివల్ల కళ్లు పొడిబారుతాయి. కావాలని మధ్య మధ్యలో కళ్లు ఆర్పండి. మీరు స్క్రిన్ చూసే రూంలో వెలుతురు సరిగ్గా ఉండాలి. చీకట్లో ఫోన్లు చూడటం చాలా ప్రమాదం. నీళ్లు ఎక్కువగా  తాగండి ఎందుకంటే  శరీరం లోపల తగినంత తేమ ఉంటేనే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఒకేవేళ కళ్లు మరీ పొడిబారుతుంటే డాక్టర్ సలహాతో కళ్లలో తేమను ఇచ్చే డ్రాప్స్ వాడవచ్చు. స్క్రీన్ వాడకాన్ని పూర్తిగా తగ్గించలేకపోయిన కొన్ని కొన్ని చిన్న చిన్న  మార్పులు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో కంటి చూపు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.