కేరళలో కేవలం వారం రోజుల్లోనే పాముకాటు వల్ల ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అత్యవసర సమీక్ష నిర్వహించి, పాముకాటు బాధితులకు చికిత్స అందించడంలో కచ్చితమైన నియమాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం జారీ చేసిన సూచనలు
పాముకాటు వేసినప్పుడు విరుగుడు మందులు లేని ఆసుపత్రులకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మంత్రి సూచించారు. ప్రస్తుతం కేరళలోని 146 ప్రభుత్వ ఆసుపత్రులలో పాము విషానికి విరుగుడు మందులు అందుబాటులో ఉన్నాయి.
పాము కుట్టిన వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయడం ఉత్తమం. ఈ అంబులెన్స్‌లో ఉండే వైద్య సిబ్బందికి ప్రథమ చికిత్సపై అవగాహన ఉంటుంది. అంతేకాకుండా, ఏ ఆసుపత్రిలో విరుగుడు మందు అందుబాటులో ఉందో వారికి ముందే తెలుస్తుంది కాబట్టి బాధితులను త్వరగా అక్కడికి చేర్చగలరు.
చేయకూడని పనులు
కంగారు పడితే రక్త ప్రసరణ వేగంగా జరిగి, విషం ఒళ్లంతా త్వరగా పాకుతుంది. కాబట్టి బాధితుడిని ప్రశాంతంగా ఉంచాలి. పాము కుట్టిన వ్యక్తిని నడవనివ్వకూడదు, పరిగెత్తనివ్వకూడదు. స్ట్రెచర్‌పైనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పాము కాటు గాయం పైన గట్టిగా తాడుతో లేదా గుడ్డతో కట్టు కట్టకూడదు. దీనివల్ల రక్త ప్రసరణ ఆగిపోయి ఇతర ఇబ్బందులు రావచ్చు.
ఎండలు పెరుగుతున్న కారణంగా చల్లదనం కోసం, ఆహారం కోసం పాములు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

