ఇసుక, పీడీఎస్‌‌ అక్రమ రవాణాకు చెక్.. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్‌‌ దాడులు ‌‌‌‌

ఇసుక, పీడీఎస్‌‌ అక్రమ రవాణాకు చెక్.. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్‌‌ దాడులు ‌‌‌‌
  • 131 క్వింటాళ్ల పీడీఎస్ ​రైస్​పట్టివేత, 19 మంది అరెస్ట్​
  • గడిచిన నెలలో 280 వెహికల్స్​, 245 మెట్రిక్​ టన్నుల ఇసుక సీజ్​

హైదరాబాద్‌‌, వెలుగు: ఇసుక, పీడీఎస్‌‌ (రేషన్ బియ్యం) అక్రమ రవాణాపై విజిలెన్స్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ చెక్​పెట్టింది. అక్రమ రవాణాతోపాటు టాక్స్ చెల్లించని వెహికల్స్​పై రాష్ట్ర విజిలెన్స్‌‌ స్పెషల్​ఫోకస్​పెట్టింది.  ట్రాన్స్‌‌పోర్ట్‌‌, మైన్స్‌‌, ఫారెస్ట్‌‌, సివిల్ సప్లై, జీఎస్టీ, కమర్షియల్ టాక్స్ శాఖలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. గత నెలలో 280 వాహనాలను సీజ్ చేసి, 245 మెట్రిక్ టన్నుల అక్రమ ఇసుక, 131 క్వింటాళ్ల పీడీఎస్‌‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు 19 మందిని విజిలెన్స్​అధికారులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సమస్యలపై నివేదికలు
 అందించారు. 

ప్రధాన రహదారుల్లో రూట్ చెకింగ్..

హైవేలు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌‌ఆర్) ఎగ్జిట్‌‌లు, టోల్ ప్లాజాలతోపాటు ఇసుక అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో ఆకస్మిక రూట్ చెకింగ్‌‌లు నిర్వహించారు. రాత్రిళ్లు అక్రమ రవాణా చేస్తున్న 200లకు పైగా వెహికల్స్​ను గుర్తించి సీజ్ చేశారు. ఇసుక, కంకర, ఇటుకలు, నిత్యావసర వస్తువుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్‌‌, జీఎస్టీ, మైన్స్‌‌, ఫారెస్ట్ యాక్ట్‌‌ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఓవర్‌‌‌‌ లోడ్, టాక్స్‌‌ చెల్లించకపోవడం, పర్మిట్లు లేకపోవడం, ఇ–--వే బిల్లులు లేని వెహికల్స్​ను సీజ్‌‌ చేశారు.  

రూ.10.79 కోట్ల ఆదాయానికి గండి..

ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి 6 ఎక్స్‌‌కవేటర్లు, 2 లారీలు, టిప్పర్, 15 ట్రాక్టర్లు సీజ్ చేశారు. 245 మెట్రిక్ టన్నుల ఇసుక, 131 క్వింటాళ్ల బియ్యం, 27 క్వింటాళ్ల గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5.8 లక్షలు ఉంది. గత నెల రూ.10.79 కోట్ల ఆదాయ నష్టాన్ని గుర్తించగా, ఇందులో రూ.1.96 కోట్లు వసూలు చేశారు.   

టోల్ ఫ్రీ నంబర్ 14432 కు తెలుపండి..

అక్రమ మైనింగ్‌‌, పన్ను ఎగవేత, ప్రభుత్వ నిధులు, వనరుల దుర్వినియోగంపై సమాచారం తెలిసినవారు విజిలెన్స్‌‌ టోల్ ఫ్రీ నంబర్ 14432 కు తెలియజేయవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.‌‌‌‌- శిఖాగోయల్‌‌, డీజీ, విజిలెన్స్ అండ్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్