
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ ప్రధాన కార్యదర్శి విపిన్ దులియా, కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఐఎఫ్ డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ సభ్యులు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తదితరులు శుక్రవారం ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి జి. కిషన్ రెడ్డి, రైల్వే బోర్డు చైర్మన్ జయవర్మ సిన్హాను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో చాలా ఏండ్లుగా ఇస్తోన్న రాయితీని కరోనా నేపథ్యంలో గత మూడేండ్లుగా నిలిపివేసిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల దేశవ్యాప్తంగా జర్నలిస్టులు విధి నిర్వహణకు సంబంధించి రైలు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా రైల్వే పాస్ లను పునరుద్ధరించి జర్నలిస్టులకు రైలు ప్రయాణం భారం కాకుండా చూడాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కె. లక్ష్మణ్ లను కలిసి కూడా కోరారు. జర్నలిస్టుల పెన్షన్ స్కీమ్, జర్నలిస్టుల రక్షణ చట్టం తదితర అంశాల పరిష్కారానికి కూడా కృషి చేయాలని
విజ్ఞప్తి చేశారు.