V6 News

పోస్టాఫీసుల్లోనే డబ్బు దాచుకుంటాం అంటున్న ప్రజలు.. 2026లో ట్రెండ్ ఎందుకు మారింది?

పోస్టాఫీసుల్లోనే డబ్బు దాచుకుంటాం అంటున్న ప్రజలు.. 2026లో ట్రెండ్ ఎందుకు మారింది?

కాలం మారుతున్నా.. టెక్నాలజీ పెరుగుతున్నా భారతీయుల నమ్మకం మాత్రం పోస్టాఫీసులపై చెక్కుచెదరలేదు. 2026లో కూడా ప్రైవేట్ బ్యాంకుల ఆకర్షణీయమైన యాప్‌లు, భారీ మార్కెటింగ్ గిమ్మిక్కులను కాదని కోట్ల మంది భారతీయులు తమ కష్టార్జితాన్ని పోస్టాఫీసుల్లోనే దాచుకుంటున్నారని తేలింది. సురక్షితమైన పెట్టుబడితో పాటు బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేట్లు లభిస్తుండటంతో.. సామాన్యుడి నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరి చూపు ఇప్పుడు పోస్టాఫీసు వైపే మళ్లుతోంది.

ప్రధానంగా సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీసు ఒక వరంలా మారింది. బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 నుంచి 7.5 శాతం వడ్డీ మాత్రమే ఇస్తుండగా.. పోస్టాఫీసు 'సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్' కింద 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. ఉదాహరణకు.. 5 లక్షల రూపాయల డిపాజిట్‌పై బ్యాంకు కంటే పోస్టాఫీసులో ఏడాదికి దాదాపు 6 వేల రూపాయలు అదనంగా లభిస్తాయి. రిటైర్మెంట్ జీవితాన్ని గడిపే వారికి ఈ మొత్తం ఎంతో ఊరటనిస్తుంది. డబ్బుకు భద్రత ఉండటంతో పాటు పెరిగిన ధరలను తట్టుకోవడానికి ఈ 8 శాతం వడ్డీ తమకు ఎంతో అవసరం అంటున్నారు ప్రజలు.

అమ్మాయిల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సుకన్య సమృద్ధి యోజన' కూడా తల్లిదండ్రులను ఆకర్షిస్తోంది. 10 ఏళ్లలోపు బాలికల పేరుతో ప్రారంభించే ఈ పథకానికి 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. కేవలం చిన్న మొత్తాలతో మొదలుపెట్టి, 15 ఏళ్ల పాటు పొదుపు చేయడం ద్వారా వారి ఉన్నత చదువులకు, పెళ్లిళ్లకు భారీ నిధిని సమకూర్చుకోవచ్చు. దీనికి సెక్షన్ 80C కింద ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపులు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తున్నాయి.

పోస్టాఫీసుపై ఈ స్థాయిలో నమ్మకం పెరగడానికి మరో కారణం ప్రభుత్వ గ్యారెంటీ. బ్యాంకులు విలీనం కావడం లేదా దివాలా తీసే ప్రమాదం ఉందనే భయాల మధ్య.. పోస్టాఫీసులో డిపాజిట్ చేసిన ప్రతి పైసాకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఆధునికతను అందిపుచ్చుకుంటూ ఇప్పుడు బయోమెట్రిక్ సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చింది. స్కూళ్లు, ఆసుపత్రులు, అంగన్‌వాడీల్లో అధికారులు అవగాహన కల్పించడంతో 25-35 ఏళ్ల యువత కూడా ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తోంది. 2026లో తెలివైన పెట్టుబడి అంటే స్టాక్ మార్కెట్లు మాత్రమే కాదు.. భరోసా ఇచ్చే పోస్టాఫీసు కూడా అని భారతీయులు మరోసారి నిరూపిస్తున్నారు.