‘‘అమ్మ బయలెల్లినాదో నాయనా.. తల్లీ బయలెల్లినాదో..’’ అంటూ అమ్మవారి పాటలతో హైదరాబాద్ నగరం మార్మోగుతోంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ బోనాల ఉత్సవాలు నగరవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. జులై నెల16న ప్రారంభం అయిన చరిత్రాత్మక బోనాల ఉత్సవాల సందడి ఆగస్టు13 వరకు నగరం పరిధిలోని మొత్తం 3,427 దేవాలయాల్లో వైభవంగా జరగనున్నాయి. మొదట చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పర్యాటక, దేవాదాయ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, నిరంతర విద్యుత్ సరఫరా, పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పర్యాటకులను ఆకర్షించేందుకు హెరిటేజ్ వాక్‌లు, నైట్ బజార్‌లు, సౌండ్ అండ్ లైట్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. లాల్‌దర్వాజా, ఉజ్జయిని మహంకాళి తదితర ప్రముఖ ఆలయాల్లో చివరి వారంలో రంగం, భవిష్యవాణి, ఫలహారం బండ్ల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
అమ్మవారికి నైవేద్యంగా బోనం
తెలంగాణ గ్రామదేవతలైన మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మలకు మహిళలు భక్తిశ్రద్ధలతో సమర్పించే నైవేద్యాన్నే బోనం అంటారు. ఆషాఢ మాసంలో మహిళలు కొత్త మట్టి లేదా రాగి పాత్రలో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో బోనం తయారు చేస్తారు. ఆ పాత్రను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి, పైభాగంలో దీపం వెలిగించి తలపై మోసుకుంటూ డప్పుల మోత, పోతరాజుల నృత్యాల మధ్య ఆలయాలకు ఊరేగింపుగా వెళ్తారు. అమ్మవారికి బోనం సమర్పించి పట్టు వస్త్రాలు, సారె అర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు.
బోనాలు టూర్ ప్రత్యేక ఆకర్షణ
బోనాల సందర్భంగా పర్యాటక శాఖ ప్రత్యేక ‘బోనాలు టూర్’ను నిర్వహిస్తోంది. చారిత్రక మహంకాళి ఆలయాల సందర్శనతో పాటు పోతరాజుల నృత్యాలు, వీధి ఊరేగింపులు, సంప్రదాయ వంటకాల రుచులను ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది. బన్సీలాల్‌పేట్ మెట్ల బావి వద్ద హెరిటేజ్ నైట్ కార్యక్రమంలో సంప్రదాయ నృత్యాలు, సంగీత విభావరి, చారిత్రక బావి విశేషాలపై చర్చలు, హైదరాబాద్ సంప్రదాయ విందు ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. సాయంత్రం వేళల్లో లైటింగ్, సంగీత కచేరీలు, సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను అలరిస్తాయి.
అమ్మవారి పాటలతో మార్మోగుతున్న నగరం
‘అమ్మ నీ మొక్కు తీర్చుకుంటా..’, ‘మైసమ్మ తల్లికి..’, ‘కొండమీద గోల్కొండ..’, ‘లష్కర్ జాతరలోన బోనాల పండగ..’, ‘బల్కంపేట ఎల్లమ్మ..’, ‘చెట్టుకింద కూసున్నవమ్మ..’, ‘సల్లంగ సూడే మా మైసమ్మా..’, ‘ఆషాఢంలో జాతర..’ వంటి అమ్మవారి భక్తి గీతాలతో నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. లైవ్ మ్యూజిక్, జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, హెరిటేజ్ వాక్‌లతో బోనాల ఉత్సవాలు భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ నగరాన్ని ఒక్కటిగా చేసే పండుగగా బోనాలు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.
బోనాల ఉత్సవాల సందడి
జులై 19: గోల్కొండ కోట, శ్రీ జగదాంబ మహంకాళి ఆలయం
జులై 26: సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి ఆలయం
ఆగస్టు 2: లాల్ దర్వాజా మహంకాళి ఆలయం (ప్రధాన బోనాలు)
ఆగస్టు 9: హైదరాబాద్‌లోని వివిధ మహంకాళి ఆలయాలు
