పొగడ్తలు పీక్స్.. హోర్డింగ్స్​ నిండా కేసీఆర్​ జపం

పొగడ్తలు పీక్స్.. హోర్డింగ్స్​ నిండా కేసీఆర్​ జపం
  • ప్లీనరీలో  ప్రశంసల వర్షం

హైదరాబాద్​, వెలుగు: మహా నాయకుడు.. లోక నాయకుడు.. లౌకిక నాయకుడు.. యుగానికొక్కడు.. కారణజన్ముడు.. తెలంగాణ విధాత.. తెలంగాణ బాపు.. ఇట్లా ఒకటా రెండా, ఎన్నో.. ఎన్నెన్నో.. టైటిళ్లు. అంతకు మిం చిన ట్యాగ్​లైన్లు.  హైదరాబాద్​లో ఎటూ చూసినా కేసీఆర్​ను కీర్తిస్తూ టీఆర్​ఎస్​ లీడర్లు బ్యానర్లు, హోర్డింగ్ లు పెట్టేశారు. టీఆర్ఎస్​ ప్లీనరీ సందర్భంగా అధినేతను ఆహో ఓహో అని పొగిడేందుకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రచార పటాటోపం ప్రదర్శించారు.  ప్లీనరీ వేదికపైన కూడా కేసీఆర్​పై ప్రశంసల వర్షం కురిపించారు. 
టైటిల్స్ లో పోటీ
గ్రేటర్​ హైదరాబాద్​లోని బస్​ స్టాప్ లు, చౌరస్తాలు, ఫ్లై ఓవర్లు.. ఎక్కడ చూసినా కేసీఆర్​ ఫొటోలు, ఆయనను కీర్తించే టైటిల్సే కనిపించాయి. ఒక టైటిల్​కు.. మరో దానికి పోటీ అన్నట్లుగా వీటిని లీడర్లు తీర్చిదిద్దడం అందరినోటా చర్చనీయాంశమైంది. అయితే.. ఇందులో తమ గొప్పేమీ లేదని, పార్టీ ఆవిర్భవించిన 20 ఏండ్ల పండుగ కావటంతో స్వయంగా  పార్టీ అధినేతే  ఈసారి ప్రచారాన్ని డిజైన్​ చేశారని, అందుకే టైటిళ్లు కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయని కొందరు టీఆర్​ఎస్​ లీడర్లు అన్నారు.