మామునూరు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ సమీపంలో భూకబ్జాలు

 మామునూరు ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ సమీపంలో భూకబ్జాలు
  • ఆరోపిస్తూ రైతు కమిషన్​ను ఆశ్రయించిన వృద్ధురాలు

హైదరాబాద్, వెలుగు: కబ్జాదారుల నుంచి తమ భూమిని రక్షించి తమకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ రైతు కమిషన్​ను ఓ వృద్ధ మహిళ రైతు ఆశ్రయించింది. వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో వందల ఎకరాల భూములను భూకబ్జాదారులు ఆక్రమించుకున్నారని సదరు వృద్ధ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన 18 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ కావటి వెంకటమ్మ అనే మహిళా రైతు రాష్ట్ర రైతు కమిషన్‌ను ఆశ్రయించింది. తనతోపాటు పదుల సంఖ్యలో నిరుపేద రైతుల భూములు కూడా ఆక్రమణకు గురైనట్లు ఆమె తెలిపింది. 

వర్ధన్నపేట మండలం, వరంగల్ తూర్పు నియోజకవర్గం శివారు ప్రాంతాల్లోని ఈ భూములపై రాజకీయ నాయకుల పలుకుబడిని వాడుకుంటు కొందరు స్థానిక నేతలు కబ్జా చేసినట్లు వెంకటమ్మ ఆరోపించింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ న్యాయం జరగకపోవడంతో ఆమె రైతు కమిషన్‌కు మొరపెట్టుకుంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, మొత్తం 258 ఎకరాల పీటీ (పట్టా) భూముల్లో అంతా పేద రైతులే ఉన్నారని, వారికి న్యాయం చేయాలని వరంగల్ కలెక్టర్‌కు లేఖ రాశారు.