కూసుమంచి, వెలుగు: తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ద్వారా సర్వే మ్యాప్‌తో కూడిన తొలి రిజిస్ట్రేషన్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. కూసుమంచి మండలం గట్టు సింగారం గ్రామం సర్వే నంబర్ 156/ఈ/1లో ఉన్న ఎకరం నాలుగు గుంటల భూమిని నేలకొండపల్లి మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన భాగం కిషన్‌రావు, అదే గ్రామానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావుకు విక్రయించే సందర్భంగా సర్వే మ్యాప్‌తో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూమికి భూ కమత పటము 1తో పాటు భూధార్ నంబర్ కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, ఆర్ఐ రాము, సిబ్బంది పాల్గొన్నారు.
భూవివాదాలకు శాశ్వత పరిష్కారం: పొంగులేటి
భూవివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా భూభారతి పోర్టల్ ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సర్వే(ఏపీఎం) ద్వారా భూధార్ నంబర్ల కేటాయింపుతో భూమి హక్కులపై శాశ్వత భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను ఈ నెల 2 నుంచి నారాయణపేట జిల్లా కొస్గి, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి అనే నిబంధనను భూభారతి చట్టంలో పొందుపరిచినట్లు తెలిపారు. అవసరమైతే భూ యజమానులు సర్వే సర్టిఫికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

