ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగర అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సోమవారం 44వ డివిజన్లో రూ.1.50కోట్లతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ అభివృద్ధి పనులు ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం చేకూరేలా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పూనుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.
ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంపై ఆర్ అండ్ బి అధికారులతో చర్చించారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని, వరదల వల్ల మరోసారి ఖమ్మం నగర ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో పాఠశాలలకు సంబంధించిన అంశాలను చర్చించారు.

