గోదావరిలోయ ప్రతిధ్వని.. నలుగురు జమైనచోట నాగన్న గొంతు, పాట

గోదావరిలోయ ప్రతిధ్వని..  నలుగురు జమైనచోట నాగన్న గొంతు, పాట

ఓ స్వరం మూగబోయింది. ఓ గజ్జె మౌనం దాల్చింది. డప్పు దరువు ఆగిపోయింది. ఆ క్షణం విప్లవ సాంస్కృతిక యోధుడు అరుణోదయ నాగన్న కన్నుమూసిన క్షణం. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది, వేలాది కళాకారులు గజ్జెకట్టారు, గొంతు విప్పారు. అరుణోదయ నాగన్న మరణం అనబడే మౌనాన్ని చీలుస్తూ భవిష్యత్ ఉద్యమబావుటాలమౌతామని శపథం చేశారు. నాగన్నకు పిడికిలి బిగించి తుది వీడ్కోలు పలికారు. నిజంగా ఖమ్మంలో ఆ ఉద్విగ్న క్షణాలు ఎంత దుఃఖాన్ని పరిచి చరిత్రగా ఆవిష్కృతమయ్యాయి. 

ఆకాశం నిండుగా పరిచిన సాయంసంధ్య ఎర్రనికేతనమై  ఆయన్ను అంతర్లీనం చేసుకుంది. పరకాల అనే ఇంటిపేరులో అరుణోదయ పేరుతో పరకాయ ప్రవేశం చేసి అరుణోదయ నాగన్నగా పీడిత హృదయాల్లో చోటు సంపాదించిన ఆయన చరిత్ర గోదావరిలోయ పోరాట చరిత్రలో అంతర్లిఖితం అయ్యింది. 

తెలుగు రాష్ట్రాలలో నాగన్న గొంతు విననివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన విప్లవోద్యమ పాటకు కేరాఫ్ అడ్రస్. ఇంతెందుకు పోరాట ప్రాంతంలో చెట్టు, పుట్ట, ఊరు, వాడ ఎక్కడ మీటినా నాగన్న పాట, ఆట ఆనవాళ్లు కనిపిస్తాయి. నాగన్న భౌతికంగా మనమధ్య లేకపోవచ్చు. కానీ ఆయన గొంతు, పాట ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు, లారీలు, ఫంక్షన్లకు, నలుగురు జమైనచోట ఎక్కడైనా వినిపిస్తుంది. తెలుగు భాష బతికున్నంత వరకు నాగన్న జీవిస్తాడు. ఒక అర్ధ శతాబ్దకాలం ఉద్యమపాటకు ఆయన ప్రాణం, ప్రణవం. 

నాగన్న ఖమ్మం జిల్లా తిర్మలాయపాలెం మండలం రాజారం గ్రామంలో జన్మించారు. గీత కార్మిక కుటుంబం లో పుట్టి పాలేరుగా జీవనం మొదలుపెట్టారు. తండ్రి పరకాల పాపయ్య, ఈయన యక్షగానం , చిడతలు రామాయణం కళారూపాలు ఆపోసనపట్టినవాడు. అదేవిధంగా తల్లి పరకాల లచ్చమ్మ కూడా ఉయ్యాల పాటల్లో దిట్ట. అందువల్లనే వారి పుత్రుడైన నాగన్నలో పాటకు పునాదులు పడ్డాయి. 

ప్రసిద్ధ రచయిత మాక్సిమ్ గోర్కి అన్నట్లు ‘‘ప్రజలలో అంతర్లీనం అయిఉన్న వారి సాంస్కృతిక పునాదులు మూలమైన ఆటపాటలు అర్థం చేసుకోకుండా సరైన ప్రజాకళారూపాలుగా మనజాలవు” అన్నట్లు నాగన్న పుట్టుకతోనే గ్రామీణ ప్రాంతం అంటే ఆట, పాటల మూలాలు అవగతం చేసుకున్నాడు. అదే సమయంలో రాజారాం గ్రామానికి ఉన్న విప్లవోద్యమం చరిత్ర, నక్సల్భరీ ప్రభావం ఆయన్ను ఆ దిశగా నడిపించాయి. ఆ గ్రామానికి చెందిన విద్యార్థి నాయకుడు శ్రీపాద శ్రీహరి ఎన్​కౌంటర్ తర్వాత నాగన్న ఆయన మార్గం ఎంచుకోవడానికి స్ఫూర్తి కలిగించింది. 

తెలుగునాట నాగన్న సాంస్కృతిక ఉద్యమ చరిత్రకు50 ఏండ్లు నిండాయి.1978 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పైన ప్రజాస్వామ్య వాదిగా కాళోజీ నారాయణరావు సత్తుపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా తలపడిన సందర్భంలో కాళోజీ తరపున గ్రామాల్లో పర్యటించి తన పాటల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు. అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు.

 1981లో అరుణోదయ సాంస్కృతిక సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర వహించాడు. తన సాంస్కృతిక బృందంతోపాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ, ప్రజలు ఇళ్లలో పూటకూళ్లు తింటూ, ప్రజల్లో మమేకమై కడదాకా జీవించిన అరుదైన ఆదర్శ కళాకారుడు నాగన్న.  ఆయన భార్య లక్ష్మితోపాటు, కుటుంబం మొత్తం సాంస్కృతిక ఉద్యమంలో భాగస్వాములను చేశాడు. 

నాగన్న జీవితం రెండు విధాల ఉద్యమానికి అంకితం చేశారు. 
1) గిరిజన ప్రజలు పోడుభూముల సమస్య, మద్యం వ్యతిరేక ఉద్యమం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, రైతులు గిట్టుబాటు ధరలు, కార్మిక ఉద్యమాలకు మద్దతు 
2) అరుణోదయ సంస్థకు ప్రధాన బాధ్యుడుగా కొనసాగడం. 

నాగన్న ప్రజల్లో ఉండి ప్రజలకోసం నిరంతరం శ్రమించిన కళాకారుడు. తెలుగునాట అరుణ కిరణాలు విప్లవోద్యమం పాటల పుస్తకం15సార్లు పునర్ముద్రణ పొందడంలో నాగన్న పాత్ర కీలకం. కానూరి వెంకటేశ్వరరావు మార్గదర్శకత్వంలో రామారావు సహచర్యంలో నాగన్న అరుణోదయ సాంస్కృతిక సంస్థను తీర్చిదిద్దారు. నాజర్ తర్వాత తరంగా బుర్రకథలకు విశేష ప్రాధాన్యత ఇచ్చిన కళాకారుడుగా నాగన్న నిలుస్తారు. డాక్టర్ కోట్నీస్, నీలం రామచంద్రయ్య బుర్రకథలతోపాటు, విప్లవ సింహం రామనర్సయ్య బుర్రకథ చెప్పడంలో సిద్ధహస్తుడు. వైవిధ్యంతో కూడిన గొంతు ఆయనది. రాగంలో నవరసాలు పలికించాడు. వేలాది ప్రజలను కంటతడి పెట్టించాడు. 

తెలుగునాట 600పైగా బుర్రకథలు ప్రదర్శించిన చరిత్ర ఆయనది. దాసు, ముత్తయ్య, ఖాదర్, ఆయన భార్య లక్ష్మి ఆయన బుర్రకథకు వంతలుగా ఉన్నారు. ఆయన చదివింది రెండో తరగతి అయినప్పటికీ ఆయన 60కి పైగా పాటలు రాశారు. ‘‘ఎర్రపూల వనంలో నా పువ్వు రాలిందో.. నగా దారిలో..!” అన్న పాట ఆయన మొదటి పాట. సృజన, నూతన, అరుణ, జయరాజు, శక్తి, యశపాల్, వెంకన్న ఇలా ఎందరో ఈనాటి కవులు, కళాకారులకు సాంస్కృతిక గురువు నాగన్న. 

నాగన్న గొంతులో కరుణ, రౌద్రం పలికించే అద్భుతం మేళవించిన ప్రజా గొంతుక ఆయనది. నాగన్న సినిమా రంగంలో కూడా కొన్ని పాటలుపాడారు. నారాయణమూర్తి సినిమాలు దండోరాలో ‘‘కొంగునడుముకు చుట్టవే చెల్లెమ్మా!”, చలో అసెంబ్లీలో ‘‘ఆగదు ఆగదు ఆగదూ ఈ ఆకలిపోరు ఆగదు”,  జై తెలంగాణల్లో “జై బోలో తెలంగాణా”పాటపాడారు. 

నాగన్న మలిదశ తెలంగాణ ఉద్యమంలో ధూంధాం సభల్లో అందెశ్రీ, గద్దర్, గూడా అంజయ్య రాసిన పాటలు పాడారు. తెలంగాణా ఏర్పాటు తర్వాత కళాకారులు సాంస్కృతిక సారధి పేరుతో ఉద్యోగాలు పొందారు. నాగన్న కుటుంబాన్ని కడుపేదరికం వెన్నాడుతున్నా,  దాన్ని తిరస్కరించాడు. తెలంగాణాలో పోతన్నలా ఆశయం ఉన్నత ప్రమాణాలతో నిలబెట్టిన గొప్ప కళాకారుడు నాగన్న. బుర్రకథ, యక్షగానం, జముకుల కథ, హరికథ, జనగానం, గొల్ల సుద్దులు, పిట్టలదొర ఇట్లాంటి ప్రజల కళా రూపాలన్నింటినీ విప్లవ సాంస్కృతిక ఉద్యమ రూపాలుగా మార్చారు. ఒక అర్థశతాబ్దంపాటు విరామం ఎరుగని కళాతపస్వి నాగన్న. 

నాగన్న జీవితంపై దశాబ్దం క్రితమే “ప్రజా కళాకారుడు నాగన్న” పుస్తకం తెలుగు నాట ప్రాశస్త్యం పొందింది. అనేకమంది తెలంగాణా కళాకారులు హైదరాబాద్,  ఖమ్మంలలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి నాగన్న పోరు పాటకు గౌరవం కల్పించారు. మరణించడానికి కొద్దిరోజుల ముందు పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ తెలంగాణా సాయుధ పోరాట కళాకారుడు అయిన తన తండ్రి సుద్దాల హనుమంతు పేరుతో అవార్డును నాగన్నకు అందజేసి సత్కరించారు. 

నాగన్న మరణించే నాటికి సిపిఐ యంయల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణా రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. నాగన్న పేదప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఆదర్శ కళాకారుడు. నాగన్నకు ఇదే ఘనమైన అక్షర సుమాంజలి. 

రచయిత: ఎన్. తిర్మల్,  సీనియర్ జర్నలిస్టు,  సామాజిక కార్యకర్త