కలియుగ వైకుంఠం తిరుమలలో సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు లక్షాదిగా భక్తులు తరలిరానున్న క్రమంలో పటిష్టమైన భద్రతా ప్రణాలికను సిద్ధం చేశారు తిరుపతి పోలీసులు.
తిరుపతి నుంచి తిరుమల వరకు నిరంతర నిఘా, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థతో పర్యవేక్షించనున్నారు పోలీసులు. పోలీస్, టీటీడీ, విజిలెన్స్ విభాగాల సమన్వయంతో భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా భారీ భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు..
తిరుపతి నుంచి తిరుమల వరకు భక్తుల రద్దీ, ట్రాఫిక్, అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ, విజిలెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. భద్రతలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నారు. తిరుమలలోని కీలక ప్రాంతాలను సీసీ కెమెరాల పరిధిలోకి తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు.
తిరుపతిలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరితో పాటు శ్రీవారి మెట్టు మార్గం వంటి కీలక ప్రాంతాలపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షణను సమన్వయం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు పోలీసులు.
