ఇన్నేళ్లలో ఎంతమంది సీఎంలు ఓల్డ్‌ సిటీకి వచ్చారు..? పాతబస్తీ గల్లీలోకి నేను తప్ప ఇంకెవరూ రాలేదు: సీఎం రేవంత్

ఇన్నేళ్లలో ఎంతమంది సీఎంలు ఓల్డ్‌ సిటీకి వచ్చారు..? పాతబస్తీ గల్లీలోకి నేను తప్ప ఇంకెవరూ రాలేదు: సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టిందని.. కానీ ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ విమర్శించారు. తాను సీఎం అయిన తర్వాత ఓల్డ్ సిటీ అభివృద్ధిపై అక్బర్, అసదుద్దీన్‌తో చర్చించానని సీఎం చెప్పారు.

ఇన్నేళ్లలో ఎంతమంది సీఎంలు ఓల్డ్‌ సిటీకి వచ్చారని ఆయన ప్రశ్నించారు. పాతబస్తీ గల్లీలోకి తాను తప్ప ఇంకెవరూ రాలేదని సీఎం రేవంత్ చెప్పారు. ఓల్డ్‌ సిటీ అభివృద్ధి కోసం అసద్‌ భాయ్‌ ఏం చెప్పినా.. వెంటనే మంజూరు చేయాలని GHMC కమిషనర్‌ను ఆదేశిస్తున్నానని -సీఎం రేవంత్‌ ప్రకటించడంతో సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

MIM, అసదుద్దీన్ భారత దేశానికి వ్యతిరేకమని కొందరు దుష్ర్పచారం చేశారని, దేశభక్తిలో అమిత్‌ షా, మోడీకి అసద్‌ తక్కువేమీ కాదని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. పాత బస్తీలో సోదరీమణులు ఇంజనీర్, డాక్టర్లు, లాయర్లు కావాలని కోరుకుంటున్నానని -సీఎం రేవంత్‌ ఆకాంక్షించారు.

►ALSO READ | స్మార్ట్ రేషన్ కార్డులపై ఒక ఊరి పేరు బదులు మరో ఊరి పేరు.. గందరగోళంపై లబ్దిదారుల గరంగరం

అభివృద్ధి చేసేందుకు తాము ఆలోచన చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ విమర్శించారు. గంగా, యమున రివర్‌ ఫ్రంట్‌కు మద్దతు తెలిపిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు.. మూసీ రివర్‌ ఫ్రంట్‌ పెడితే విమర్శలు చేస్తున్నాయని -సీఎం రేవంత్‌ రెడ్డి సభలో చెప్పారు.