V6 News

ఫలించిన ప్రయత్నం!..ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సక్సెస్ ఫుల్గా ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’

ఫలించిన ప్రయత్నం!..ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సక్సెస్ ఫుల్గా ‘ఎవ్రీ చైల్డ్  రీడ్స్’
  •     పిల్లల్లో 85 శాతానికి పెరిగిన ఇంగ్లీష్  పఠన సామర్థ్యాలు
  •     ఒకటి నుంచి ఐదో తరగతి చదివే 29 వేల విద్యార్థులకు లబ్ధి
  •     బడిబాటలో విద్యార్థులు ఇంగ్లీష్ చదివే వీడియోలు ప్రదర్శించాలని నిర్ణయం
  •     తమ పిల్లల చదువులపై సంతోషం వ్యక్తం చేస్తున్న పేరెంట్స్

ఖమ్మం, వెలుగు: ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు ఇంగ్లీష్  భాషపై పట్టు సాధించాలనే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో చేపట్టిన ‘ఎవ్రీ చైల్డ్  రీడ్స్’ కార్యక్రమం విజయవంతమైంది. ఆరు నెలల కింద ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు గవర్నమెంట్  స్కూళ్లలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 29 వేల మంది విద్యార్థుల్లో 55 శాతం మంది విద్యార్థులు అక్షర స్థాయిలో, 34 శాతం స్టూడెంట్స్​ పదాల స్థాయిలో, 11 శాతం వాక్యాలు చదవగలిగే స్థాయిలో ఉన్నారు. 

21 వారాల తర్వాత ప్రస్తుతం 85 శాతం మంది వాక్యాలు చదవగలుగుతున్నారని సర్వేలో తేలింది. 29 వేల మందిలో 21,309 మంది విద్యార్థులు వాక్య పఠనంలో నైపుణ్యం సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టేట్  కౌన్సిల్  ఆఫ్  ఎడ్యుకేషనల్  రీసెర్చ్​ అండ్  ట్రైనింగ్(ఎస్సీఈఆర్టీ) బృందం ఖమ్మం జిల్లాలో పర్యటించి విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని అంచనా వేసింది. రాష్ట్ర స్థాయి అధికారుల సర్వేలోనూ ఎవ్రీ చైల్డ్  రీడ్స్​ కార్యక్రమం వల్ల పిల్లల్లో అభ్యసనం, పఠనా సామర్థ్యం పెరిగినట్లు గుర్తించి జిల్లా అధికారులను అభినందించారు.  

కలెక్టర్​ ప్రత్యేక చొరవతో..

ఎవ్రీ చైల్డ్  రీడ్స్ కార్యక్రమాన్ని గతేడాది ఖమ్మం కలెక్టర్​ అనుదీప్  దురిశెట్టి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రారంభించారు. మొదట చింతకాని మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టగా, సత్ఫలితాలు రావడంతో జిల్లాలోని 958 స్కూళ్లకు విస్తరించారు. విద్యార్థులకు అక్షరాలు, పదాలు, వాక్యాలు ఎలా చదవాలో చెప్పడమే కాకుండా ఫోనెటిక్  సౌండ్ తో నేర్పేలా కోర్సును డిజైన్​ చేశారు. కార్యక్రమం అమలుతో పాటు విద్యార్థుల పురోగతిని పరిశీలించేందుకు ప్రత్యేక యాప్​ను రూపొందించి, దాన్ని యూడీఐఎస్​కు అనుసంధానం చేశారు. ప్రతి రోజు సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు గంట సేపు చదివే సామర్థ్యంపై ప్రాక్టీస్  చేయించేందుకు బుక్ లెట్  ఇచ్చారు. 

ప్రతి స్కూల్ లో స్టూడెంట్స్​ డేటాను యాప్​లో నమోదు చేస్తుండగా, ప్రతి బుధవారం ఫలితాలను విశ్లేషిస్తూ, వాటిని మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకున్నారు. టీచర్లు, పిల్లలతో మాట్లాడి వారానికి ఒకసారి ఫలితాల ఆధారంగా వ్యూహాలను మారుస్తూ ముందుకు తీసుకెళ్లారు. విద్యార్థుల స్థాయిని బట్టి ప్రత్యేక సామగ్రిని రూపొందించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వారికి వేర్వేరు విధానాలు అమలు చేశారు. టీచర్లు, అధికారుల నిరంతర కృషితో స్టూడెంట్స్ లో ఇంగ్లీష్​ చదివే సామర్థ్యం 11 శాతం నుంచి 85 శాతానికి పెరిగింది. విద్యార్థులు ఇంగ్లీష్​లో తడబాటు లేకుండా చదవగలుగుతున్న వీడియోలను వచ్చే నెల నుంచి చేపట్టే బడిబాటలో పేరెంట్స్ కు చూపెట్టాలని అధికారులు నిర్ణయించారు. 

ప్రతి విద్యార్థి స్వతంత్రంగా చదివేలా తీర్చిదిద్దాలి

ప్రతి విద్యార్థి స్వతంత్రంగా చదవగలిగే స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా ఎవ్రీ చైల్డ్  రీడ్స్  కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఖమ్మం కలెక్టర్  అనుదీప్  దురిశెట్టి తెలిపారు. ఖమ్మం ఎస్ఆర్  గార్డెన్స్ లో మంగళవారం ఎవ్రీ చైల్డ్  రీడ్స్(ఈసీఆర్) విజయోత్సవ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్  శ్రీజతో కలిసి పాల్గొన్నారు. అక్షరాలు, పదాలు, వాక్యాలు అనే మూడు స్థాయిల్లో విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని అంచనా వేశామని తెలిపారు. విద్యార్థుల్లో పఠన వేగాన్ని పెంపొందించడం, అర్థ గ్రహణ నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. 

నిమిషానికి 30, 40, 50 పదాలు చదవగలిగే లక్ష్యాలను నిర్ధేశించి పని చేయాలన్నారు. ఎన్నికలు, దసరా సెలవులు వంటివి వచ్చినప్పటికీ కార్యక్రమాన్ని కొనసాగించి ఫలితాలు సాధించగలిగామని తెలిపారు. అనంతరం ఈసీఆర్  అమలులో ప్రతిభ చూపిన హెచ్ఎంలకు మెమోంటోలు అందజేసి, విద్యార్థులు, పేరెంట్స్, టీచర్లతో కలిసి భోజనం చేశారు. జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఈవో చైతన్య జైనీ, విద్యా శాఖ ప్లానింగ్  కో ఆర్డినేటర్  సీహెచ్  రామకృష్ణ, సీఎంవో ప్రవీణ్  పాల్గొన్నారు. 

సొంతంగా స్టోరీలు రాస్తున్న

ఎవ్రీ చైల్డ్  రీడ్  కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు టీచర్స్  మా కోసం స్పెషల్ గా క్లాసులు తీసుకుంటున్నారు. మూడు నెలల్లోనే పూర్తి స్థాయిలో వర్డ్స్  రాయడం, చదవడం నేర్చుకున్నా. సెంటెన్స్  ఫార్మ్  చేసి రాయడం, చదవడం నేర్చుకున్న. సొంతంగా సెంటెన్స్ ఫార్మ్  చేసి, స్టోరీలు రాస్తూ చదువుతున్న. దీని వల్ల నాకు గురుకులం, మోడల్  స్కూల్ లో సీట్  కూడా వచ్చింది.
–షణ్ముఖ, 5వ తరగతి విద్యార్థి, వీఎం బంజర్

గతంలో కంటే స్పీడ్ గా చదువుతున్నాడు

మా అబ్బాయి కార్తీక్  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. గతంలో ఇంటికి వచ్చాక హోమ్  వర్క్  చేసేటప్పుడు, ఎగ్జామ్స్ కు చదివేటప్పుడు కొంచెం నెమ్మదిగా ఉండేవాడు. ఎవ్రీ చైల్డ్  రీడ్  కార్యక్రమం స్కూల్ లో ప్రారంభించిన తర్వాత చదవడంలో వేగం పెరిగింది. వర్డ్స్ రాయడం, సెంటెన్స్  చెప్పడం చేస్తున్నాడు.
– భూక్యా అరుణ, పెనుబల్లి