- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని
తల్లాడ, వెలుగు : దేశ ప్రధాని నరేంద్ర మోడీ విధానాల వల్ల దేశం వెనుక్కి పోతోందని, మోడీ-ట్రంప్ దోస్తీ వల్ల భారత వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. రైతులను రక్షించుకునేందుకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. సంఘం ఖమ్మం జిల్లా మూడవ మహాసభలు సీనియర్ నాయకులు తాతా భాస్కరరావు జెండా విష్కరణతో సోమవారం తల్లాడ వాసవి కళ్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి.
ముఖ్య అతిథిగా పాల్గొన్న పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ... మన దేశ ఉత్పత్తులు విదేశాల్లో అమ్మాలంటే 50 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోందని, అమెరికా ఉత్పత్తులు భారతదేశంలో జీరో పన్నుతో విక్రయించేందుకు మోడీ,-ట్రంప్ ఒప్పందాలు చేసుకున్నారని వివరించారు. దీంతో రైతులు ఉత్పత్తి చేసిన వస్తువులకు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదానీ, అంబానీలు రోజురోజుకీ ధనవంతులవుతున్నారని, కానీ మోడీ విధానాల వల్ల దేశం వెనక్కి పోతోందని ఆందోళన చేపట్టారు.
1936లో ప్రారంభమైన రైతాంగ పోరాటంలో పది లక్షల ఎకరాలు భూస్వాముల నుంచి తీసుకొని పేదలకు పంచి, పదివేల గ్రామాలకు విముక్తి కల్పించామని గుర్తు చేశారు. ఆనాటి పరిస్థితులే ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయని, రైతాంగ పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాదినేని రమేష్, కార్యదర్శిగా బొంతు రాంబాబును ఎన్నిక చేశారు. ఈ కార్యక్రమంలో బొంతు రాంబాబు, శీలం సత్యనారాయణ రెడ్డి, శీలం పకీరమ్మ, నల్లమోతు మోహన్ రావు, కళ్యాణం కృష్ణయ్య, అయినాల రామలింగేశ్వరరావు, సత్తెనపల్లి నరేష్, చల్లా నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

