రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం (డిసెంబర్ 3) బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు, పోలీసు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కి చెందిన ఒక జవాన్ మరణించాడు. మరొక జవాన్ గాయపడ్డాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-బీజాపూర్ సరిహద్దు సమీపంలోని గంగలూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. వెంటనే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్), సీఆర్పీఎఫ్ఎలైట్ యూనిట్లతో కూడిన సంయుక్త బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టింది.
ఈ క్రమంలో తారసపడ్డ మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఓపెన్ ఫైరింగ్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు నక్సలైట్లు చనిపోయారు. దురదృష్టవశాత్తు పోలీసు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కి చెందిన ఒక జవాన్ మరణించగా, మరొకరు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
గాయపడిన జవాన్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఘటన స్థలంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు.
కాగా,2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్కగార్తో మావోయిస్టు పార్టీ కకావికలమవుతున్నది. కేంద్రం పెట్టుకున్న లక్ష్యానికి నాలుగు నెలల ముందే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకున్నది.
దండకారణ్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చిన అగ్రనేతల్లో నంబాల కేశవరావును ఇప్పటికే ఎన్‌కౌంటర్‌చేసిన భద్రతా బలగాలు.. ఇటీవల మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ మడవి హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశాయి. మరోవైపు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లాంటి సీనియర్లీడర్లు లొంగిపోయారు.
మరో అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్దేవ్జీ సైతం పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాంతరం దండకారణ్యంలో జనతన సర్కార్ నడిపిన మావోయిస్ట్ పార్టీ వరుస ఎదురుదెబ్బలతో కకవికాలం అవుతోంది. భద్రతా దళాల దూకుడుతో మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకున్నది.
