- ఫలించిన ప్రభుత్వ ప్రయత్నాలు
- ముందుకొచ్చిన 13 సంస్థలు..
- మరో 3 సంస్థలతో ఆర్ అండ్ బీ చర్చలు
- 5 శాతం ఎక్సెస్‌పై జీవో జారీ
- రేపో, ఎల్లుండో అగ్రిమెంట్లు
హైదరాబాద్, వెలుగు: హ్యామ్ రోడ్లకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ కృషి ఫలించి.. 5 శాతం ఎక్సెస్‌కే టెండర్లు ఫైనల్ అవుతున్నాయి. పనులు చేయడానికి 13 కాంట్రాక్ట్ సంస్థలు అంగీకరించాయి. మరో 3 ఏజెన్సీలతో ఆర్ అండ్ బీ ఆఫీసర్లు చర్చలు జరుపుతున్నారు. రేపో, ఎల్లుండో కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో త్వరలోనే రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో చేపట్టబోయే హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) ప్రాజెక్ట్ తొలి దశలో రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ.13,006.27 కోట్ల వ్యయంతో 441 రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మొత్తం 6,092.37 కిలోమీటర్ల పొడవుతో 34 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవగా.. 5 నుంచి 23 శాతం ఎక్సెస్‌పై ఏజెన్సీలు టెండర్లు వేశాయి. పంచాయతీ రాజ్‌శాఖ తరఫున రూ. 6,294.81 కోట్ల ఖర్చుతో 7,449.50 కిలో మీటర్ల మేర చేపట్టాల్సిన 2,162 రోడ్ల నిర్మాణానికి సంబంధించిన 17 ప్యాకేజీల పరిధిలో టెండర్లను పిలిచారు. ఈ శాఖలో కూడా 30 శాతానికి మించి అధికంగా టెండర్ కోట్ చేశారు. ఫైనాన్షియల్ బిడ్లు తెరిచాక ఈ విషయం బయటికి పొక్కడంతో రాష్ట్రంలో పెద్ద దుమారం రేగింది. బీఆర్ఎస్ లీడర్లు ఈ ప్రాజెక్ట్‌లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రచారం చేశారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. సీఎం రేవంత్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీర్లతో ప్రభుత్వం పలు దశల్లో చర్చలు జరిపింది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నది. టెండర్లలో పేర్కొన్న పలు నిబంధనలను ప్రభుత్వం మార్చేస్తూ హ్యామ్ రోడ్ల టెండర్లను 5 శాతం ఎక్సెస్ కే ఫైనల్ చేసేలా ప్రభుత్వం జీవో 21 జారీ చేసింది.
పలు నిబంధనలు తొలగింపు
ప్రభుత్వ జీవో ప్రకారం టెండర్ ధరలను తగ్గించే క్రమంలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. కాంట్రాక్టర్లు తమ వాటా కింద పెట్టే 60 శాతం పెట్టుబడిపై చెల్లించాల్సిన 9.30 శాతం జీఎస్టీని భవిష్యత్తులో ప్రభుత్వమే రీయింబర్స్ చేయనున్నది. జీఎస్టీ చెల్లించినట్టుగా బిల్లులు, రసీదులు సమర్పించిన తర్వాత నెలలోనే ఏజెన్సీలకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించనున్నది. అలాగే, రోడ్ల నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్, అంబులెన్స్ సర్వీసుల కోసం అయ్యే 4.46 శాతం ఖర్చును కూడా తగ్గించేసింది. అంబులెన్స్‌లు, పెట్రోలింగ్ వాహనాల నిబంధనలను టెండర్ల నుంచి తొలగించింది. అత్యవసర సమయంలో వైద్య సేవల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 108 అంబులెన్స్‌లను వినియోగించుకోవాలని, ప్రభుత్వ పెట్రోలింగ్ వెహికిల్స్ వినియోగించుకోవాలని తెలిపింది. దీంతో డ్రాఫ్ట్ కన్సెషన్ ఒప్పందంలోని షెడ్యూల్ సీ నుంచి ఈ రెండు నిబంధనలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
రూ.1,900 కోట్ల అడ్వాన్స్ చెల్లింపులు
హ్యామ్ ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం రోడ్ల నిర్మాణ పనులు స్టార్ట్ చేసినప్పుడు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద 10 శాతం చెల్లించాలి. వర్క్ ముగిసేనాటికి 30 నెలల్లో బ్యాలెన్స్ డబ్బుల్లో 30 శాతం నిధులు చెల్లిస్తారు. బ్యాలెన్స్ 60 శాతం నిధుల చెల్లింపుకు 15 ఏండ్ల గడువు పెట్టింది. దీంతో రాష్ట్రంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ తరఫున మొత్తం రూ.19 వేల కోట్లతో పనులు మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలకు రూ.1,900 కోట్లు చెల్లించాల్సి వస్తుంది.
