ఆ మందులతో దోమలు పోతాయి .. మరి ఆరోగ్యం!

ఆ మందులతో దోమలు పోతాయి .. మరి ఆరోగ్యం!

దోమలు.. ఫలానా సీజన్​ అని కాకుండా ఎప్పుడూ ఉంటాయని అవి కుడితే మలేరియా, డెంగ్యూ  వ్యాధులు వస్తాయని తెలియందెవరికి! అంతేకాదు చాలావరకు వైరల్​ ఇన్ఫెక్షన్లకి దోమలే కారణం. వీటిని ఇంట్లోంచి  తరిమేయడానికి ఒకప్పుడు దోమ తెరలు వాడేవాళ్లు. ఇప్పుడు లిక్విడ్​ వేపరైజర్​, మస్కిటో కాయిల్స్​ (దోమల బిళ్లలు) వాడుతున్నారు చాలామంది  కానీ, వీటిని వాడడం వల్ల హెల్త్​ ఇష్యూస్​ కొనితెచ్చుకుంటున్నామన్న సంగతి గుర్తించట్లేదు. లిక్విడ్ వేపరైజర్​​ నుంచి వచ్చే రసాయనాలు, మస్కిటో కాయిల్స్​ పొగ హెల్త్​ ప్రాబ్లమ్స్​​కి దారి వేస్తున్నాయి. అందుకే దోమలు కుట్టకుండా ఆల్టర్నేటివ్​ మెథడ్స్​ పాటించాలి అంటున్నారు ఫిజీషియన్​ జి.నవోదయ.   

లిక్విడ్​ వేపరైజర్, లిక్విడ్​​ స్ప్రేలోనూ సువాసనతో పాటు ప్రల్లెథ్రిన్ అనే పెస్టిసైడ్​ ఉంటుంది. లిక్విడ్​ వేపరైజర్, మస్కిటో కాయిల్​ పెట్టిన కొంచెం సేపటికే  కొందరికి తలనొప్పి వస్తుంది. కళ్లు మండుతాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. చర్మం మీద దద్దుర్లు కూడా వస్తాయి. కొందరు ఆ వాసన, పొగ పడక వాంతి చేసుకుంటారు కూడా. దోమల బిళ్లల తయారీలో అల్యూమినియం, క్రోమియం, టిన్​ వంటి హెవీ మెటల్స్​, పెరిత్రిన్​ అనే పెస్టిసైడ్స్, ఇన్​సెక్టిసైడ్స్​, సిట్రోనెల్లా వంటి అరోమాటిక్​ పదార్థాలు (సువాసనతో ఉన్నవి)  వాడతారు. అందుకే వాటిని ముట్టుకుంటే ఘాటు వాసన వస్తుంది. వీటిని కాల్చినప్పుడు వచ్చే పొగలో కార్సినోజెన్స్​ ఉంటాయి. ఈ పొగని ఎక్కువ రోజులు పీల్చితే ఊపిరితిత్తుల క్యాన్సర్ రావొచ్చు. ఆస్తమా ఉన్నవాళ్లకి ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కొందరిలో క్రానిక్​ అబ్​స్ట్రక్టివ్​ పల్మొనరీ డిసీజ్​ (సిఒపిడి) కూడా వచ్చే ఛాన్స్​ ఉంది.

ఇవి కూడా కారణం
వేపరైజర్​ పెట్టినప్పుడు, మస్కిటో కాయిల్స్​ వెలిగించినప్పుడు తలుపులు, కిటీకీలు మూసేస్తారు. దాంతో లోపలి గాలి బయటకి పోదు.  బయటిగాలి లోపలికి రాదు. వాటి నుంచి వచ్చే రసాయనాల్ని పీల్చుకోక తప్పదు. అలాగని తలుపులు, కిటికీలు తెరిచి దోమల బిళ్లలు వెలిగిస్తే ఉపయోగం​ ఉండదు. అందుకే దోమలు ఇంట్లోకి రాకుండా, కుట్టకుండా ఇతర పద్ధతులు పాటించాలి. 

ఇలాచేస్తే బెటర్​
దోమ తెరలు వాడితే దోమల్ని తరిమేందుకు రసాయనాలు ఉన్న మందులు అవసరం ఉండదు. మెయిన్​ డోర్, కిటికీలకు కూడా దోమ తెరలు పెట్టించాలి. చీకటికాక ముందే కిటికీలు, తలుపులు క్లోజ్​​ చేయాలి.   రాత్రిపూట నిండుగా డ్రెస్​ వేసుకోవాలి. దోమలు కుట్టకుండా క్రీమ్స్​ రాసుకోవాలి.   మస్కిటో బ్యాట్స్​ వాడాలి. మస్కిటో రెపెల్లెంట్​ క్రీమ్స్ రాసుకుంటే దోమలు కుట్టవు. ఒకవేళ ఇలాంటివి రాసుకున్నప్పుడు ఎలర్జీగా అనిపిస్తే మానేయాలి. అలాంటివేం రాలేదంటే కంటిన్యూ చేయొచ్చు. 
ఇంటి చుట్టుపక్కల మురికి నీరు, నిల్వ నీరు ఉంటే వాటిలో దోమలు పెరుగుతాయి. అందుకే పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి.  ఆస్తమా, క్రానిక్​ అబ్​స్ట్రక్టివ్​ పల్మొనరీ డిసీజ్​లు​ ఉన్నవాళ్లు మస్కిటో కాయిల్స్, వేపరైజర్స్​ ఎక్కువగా వాడొద్దు. మరీ ముఖ్యంగా వీటిని చిన్నపిల్లలకి దూరంగా పెట్టాలి. 

చిన్నపిల్లల్లో
మస్కిటో కాయిల్స్​ వల్ల చిన్నపిల్లల్లో ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  పిల్లలు పొరపాటున కాయిల్​ని మింగితే పాయిజన్​ అవుతుంది. కాలుతున్నప్పుడు వాటిని ముట్టుకుంటే గాయాలు అవుతాయి. వేపరైజర్​ నుంచి వచ్చే రసాయనాలు​ కూడా పిల్లల్లో ఆస్తమా, తలనొప్పికి కారణమవుతాయి. 
డాక్టర్​.జి.నవోదయ, కన్సల్టెంట్,​ జనరల్​ మెడిసిన్​, కేర్​ హాస్పిటల్స్​, హైదరాబాద్​.