గోవా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న నిందితులను గురువారం (మార్చి 26) హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో గోవా నుంచి విమాన మార్గంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న రాకెట్‌ను ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు. పహాడీషరీఫ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్టీఎఫ్ ‘ఏ’ టీమ్ ఈ కేసును వెలుగులోకి తీసుకువచ్చింది.
గోవా నుంచి అక్రమంగా తెచ్చిన 127 కాస్ట్ లీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు. అధికారుల సమాచారం మేరకు మొత్తం 127 మద్యం బాటిళ్లు అంటే 111.5 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు చెప్పారు. దీని విలువ సుమారు 2 లక్షల 50 వేలకు పైగా ఉంటుందని చెప్పారు.
ఈ ఘటనలో రెండు కేసులు నమోదు చేశారు. వరంగల్‌కు చెందిన మునిగంటి వినోద్ కుమార్ నుంచి 32 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ గోవా మార్గానికి సంబంధించిన మరో కేసులో 95 బాటిళ్లు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లతో సహా నిందితులను మీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు పోలీసులు అప్పగించారు. అక్రమ మద్యం రవాణాపై పోలీసులు మరింత నిఘా పెంచినట్లు తెలిపారు.
