నాలుగో టెస్టులో భారత్ సూపర్ విక్టరీ

నాలుగో టెస్టులో భారత్ సూపర్ విక్టరీ
  • 157 పరుగుల తేడాతో గెలుపు
  • సిరీస్ 2-1 తేడాతో ఆధిక్యం

ఓవల్: ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 157 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ తో సిరీస్ లో 2 – 1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ నిర్దేశించిన 368 పెట్టిన టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ శుభారంభం చేసినా.. ఆ తర్వాత టపటపా వికెట్లు కోల్పోయి కుప్పకూలి ఓటమిపాలైంది. టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన  ఇంగ్లండ్ ఓపెనర్లు భారత్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడారు. ఓపెనర్లు హసీబ్ హమీద్ 193 బగుల్లో 6 ఫోర్లతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ రోరీ బర్న్స్ కూడా 125 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేసి శుభారంభం చేశారు. 
తర్వాత వచ్చిన కెప్టెన్ జోరూట్  భారత్ కు దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసినా సహచరుల నుంచి సహకారం లభించలేదు. కాసేపు క్రీజులో పాతుకుపోయిన జోరూట్ థర్డ్ టెస్టు మ్యాచ్ మాదిరే ప్రమాదకరంగా కనిపించాడు. అయితే క్రీజులో పాతుకపోతున్నాడని భావిస్తున్న తరుణంలో జో రూట్ 36 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఇంగ్లండ్ పతనానికి నాంది పడింది. మిగిలిన బ్యాట్స్ మెన్ భారత్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తడబడుతూ ఆడడంతో ఒత్తిడి పెరిగి పోయింది. ఇంగ్లండ్ ఆటగాళ్ల తడబాటుపై భారత బౌలర్లు ఉమేష్ యాదవ్, బుమ్రా, శార్దూల్ తదితరులు చక్కటి బంతులతో ఆధిక్యం చాటారు. ఫలితంగా ఇంగ్లండ్ 210 పరుగులకే చాపచుట్టేయడంతో భారత్ ఘన విజయం సాధించింది.