ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, చీరల వ్యాపారం చేసే భార్యను చంపి భర్త ఆత్మహత్య : కొడుకులు ఇద్దరూ డాక్టర్ చదువుతున్నారు..!

 ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, చీరల వ్యాపారం చేసే భార్యను చంపి భర్త ఆత్మహత్య : కొడుకులు ఇద్దరూ డాక్టర్ చదువుతున్నారు..!

 సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ లో మూడు లక్షల మందికి పైగా ఫాలోవర్లు.. సొంతంగా చీరల వ్యాపారాన్ని నిర్మించుకున్న ఆమె ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్.. చివరికి భర్త చేతిలోనే బలైన విషాద ఘటన చెన్నైలో కలకలం రేపింది. ఆ తర్వాత భర్త కూడా  ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకోవడం  మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.

పోలీసుల కథనం ప్రకారం...  42 ఏళ్ల నాగలక్ష్మి అనే మహిళ.. భర్త సుబ్రమణియన్ (52)తో  వైవాహిక విభేదాల కారణంగా విడిపోయి కొంతకాలంగా విడివిడిగా నివసిస్తున్నారు. సుబ్రమణియన్ బంధువులతో కలిసి ఉండేందుకు మధురైకి వెళ్లిపోయారు. మనస్పర్థలు వచ్చి విడిపోయిన, ఆమె కుంగిపోకుండా.. నంగనల్లూరులో 'శ్రీ సాయి సిల్క్స్' పేరుతో చీరల వ్యాపారం మొదలుపెట్టింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్ల ద్వారా ప్రజాదరణ పొంది, మూడు లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. మొత్తంగా ఆమె వ్యాపారం చెన్నైలో ఒక పెద్ద షోరూమ్‌గా విస్తరించేంతగా వృద్ధి చెందింది.

కొంతకాలంగా మధురైలో విడిగా ఉంటున్న భర్త సుబ్రమణియన్, ఈ మధ్య చెన్నైకి తిరిగి వచ్చాడు. తాను మారానని, పాత తప్పులకు క్షమించమని అడిగి నాగలక్ష్మితో కలిసి ఉండటం మొదలుపెట్టాడు. అందరూ గొడవలు సర్దుమణిగాయని అనుకున్నారు. కానీ, ఏప్రిల్ 27న సీన్ మొత్తం మారిపోయింది.

కొడుకుకు మెసేజ్
చెన్నైలో డెంటిస్ట్ చదువుతున్న చిన్న కొడుకుకు తన తండ్రి నుండి ఒక కలవరపరిచే మెసేజ్ వచ్చింది. ఏదో జరుగబోతుందని  అనుమానం వచ్చిన అతను హుటాహుటిన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అక్కడ అతను చూసిన దృశ్యం గుండెల్ని పిండేసింది. తన తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా.. మరో గదిలో తండ్రి ఉరి వేసుకుని కనిపించాడు.

ఈ దంపతుల పిల్లలు పెద్ద కొడుకు రష్యాలో డాక్టర్ చదువుతుండగా.. చిన్న కొడుకు చెన్నైలో డెంటిస్ట్ చదువుతున్నాడు. పిల్లలిద్దరూ ప్రయోజకులు అవుతున్న సమయంలో, తల్లిదండ్రులిద్దరూ ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. 

ఎందుకు ఇలా జరిగిందంటే
నాగలక్ష్మి వ్యాపారంలో ఎదుగుతుండటం, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు వస్తున్న పాపులారిటీ విషయంలో భర్త అసూయ చెందాడా ? లేక మరేదైనా పాత గొడవలు కారణమా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పచ్చని సంసారంలో పగ, అనుమానం ఏ స్థాయికి తీసుకెళ్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.