V6 News

గృహిణులకు నెలకు రూ.2 వేలు.. మూడు సిలిండర్లు ఫ్రీ.. తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ

గృహిణులకు నెలకు రూ.2 వేలు.. మూడు సిలిండర్లు ఫ్రీ.. తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ

చెన్నై: తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, డీఎంకే కుటుంబ పాలనను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ మాజీ జాతీయ  అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడారు. డీఎంకే హయాంలో తమిళనాడు అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల కమిటీ రూపొందించిన ఈ మేనిఫెస్టోలో సుపరిపాలన, శాంతిభద్రతలు, సామాజిక న్యాయం, మహిళా శిశు సంక్షేమం, ఆరోగ్యం, రైతు సంక్షేమం వంటి 12 ప్రధానాంశాలకు చోటు కల్పించారు.

మేనిఫెస్టోలో ఆ పార్టీ పలు హామీలను గుప్పించింది. గృహిణులకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందించడంతో పాటు,  ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపింది. అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి ఒకేసారి రూ. 10,000 గ్రాంట్‌ అందిస్తామని చెప్పింది. గృహోపకరణాల కోసం రూ. 8,000 విలువైన కూపన్లు ఇస్తామని పేర్కొంది. మహిళలు తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీలో 3% మినహాయింపు ఇస్తామని వెల్లడించింది. మహిళలు ఈ-స్కూటర్లు కొనుగోలు చేసేందుకు రూ.25 వేల సబ్సిడీ అందిస్తామని వివరించింది.

‘ఉళవే తాయి’ పథకం కింద పీఎం-కిసాన్ నిధులకు అదనంగా మరో రూ. 3,000 కలిపి ఏటా రూ. 9,000 సాయం చేస్తామని ప్రకటించింది. చిన్న, సన్నకారు రైతులకు  రూ. 50,000 గ్రాంట్‌ అందిస్తామని వెల్లడించింది. జల్లికట్టు ఎద్దులను పెంచే వారికి నెలకు రూ.2,000 సాయం అందిస్తామని తెలిపింది. ఒకవేళ క్రీడలో పాల్గొన్న వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని  ప్రకటించింది. విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పింది. 

ఆలయాల్లో స్థానికులకు ప్రత్యేక సమయం

తమిళ సంస్కృతిని కాపాడుతామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. తైపూసం పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని తెలిపింది. తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని పేర్కొంది.  ప్రధాన ఆలయాల్లో స్థానికుల కోసం రోజుకు రెండు గంటల ప్రత్యేక దర్శన సమయాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చింది. నేరాల నియంత్రణకు ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానం అమలు చేస్తామని చెప్పింది.  

తమిళనాడును గంజాయి రహితంగా మారుస్తం

తమిళనాడును ‘గంజాయి రహిత’ రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. డ్రగ్స్ విక్రయించే ముఠాలు, రిపీట్ అఫెండర్లకు మరణశిక్ష పడేలా చట్టాలను కఠినతరం చేస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఈ  కూటమికి తగిన బుద్ధి చెబుతారని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు.