లేబర్ కోడ్స్ రాష్ట్రంలో  అమలు చేయొద్దు : కవిత

లేబర్ కోడ్స్ రాష్ట్రంలో  అమలు చేయొద్దు : కవిత
  • అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలి: కవిత
  • సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశంలో కామెంట్స్

హైదరాబాద్, వెలుగు: నైనీ బ్లాక్ టెండర్ పై సింగరేణి కార్మికులు చేసిన ఆందోళనతో ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆ ఆక్రోశంతోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణిలో 13 వేల మంది కార్మికులు ఎక్కువగా ఉన్నారని మాట్లాడారని మండిపడ్డారు. సేవ్ సింగరేణి పేరిట హైదరాబాద్ తెలంగాణ జాగృతి ఆఫీస్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. సింగరేణిలో డిపెండెంట్ కార్మికుల నియామకాల జోలికి వస్తే ప్రభుత్వం తాట తీస్తామని, కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని భట్టి ఇటీవల అసెంబ్లీలో స్టేట్ మెంట్ చేయడమేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కొన్ని సడలింపులతో 20 వేల మంది కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు.

గత ప్రభుత్వ పాలసీపై ఎంక్వైయిరీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. “కేంద్రం తెచ్చిన నాలుగు నల్ల చట్టాల(లేబర్ కోడ్స్)ను అమలు చేసేది లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి.. అసెంబ్లీలో తీర్మానం చేయాలి. మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి.. పెండింగ్ కేసులు పరిష్కరించాలి. అలియాస్ నేమ్స్ సమస్యను పరిష్కరించాలి. సింగరేణి సంస్థ అల్ట్ మైన్ కంపెనీతో కంపెనీతో రూ.2,250 కోట్లతో చేసుకున్న ఒప్పందంపై ‘వైట్​పేపర్’ రిలీజ్ చేయాలి. నైనీ, తాడిచర్ల వంటి బొగ్గు గనులను కొత్త వచ్చే గనులను కూడా సింగరేణి సంస్థనే ఆపరేట్ చేయాలి” అని సమావేశంలో ఐదు తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలను లేఖ రూపంలో ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.

మేము చిన్న రౌడీలం

హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ పై రౌడీ షీట్ పెట్టారని, ఆయన పెద్ద రౌడీ అని ప్రభుత్వం అనుకుంటే తాము చిన్న రౌడీలమని కవిత చెప్పారు. తమకు ధర్మసమాజ్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా జతచేరాయని,తమ రౌడీల గుంపును తట్టుకోవటం ప్రభుత్వం వల్ల కాదని అన్నారు. ప్రభుత్వం పరిష్కారం చూపించకుంటే బొగ్గు బాయి బాట పడతామన్నారు. సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రధాని మోదీ లేబర్ కోడ్స్ పేరుతో నాలుగు నల్ల చట్టాలు తెస్తే.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం ఆ చట్టాలు తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని తేల్చిచెప్పారన్నారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటిని అమలు చేయటం లేదని పేర్కొన్నారు. కానీ మన రాష్ట్రం మాత్రం ఈ చట్టాలను అమలు చేయమని ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు.

సోలార్, లిథియం రిఫైనరీ ఒప్పందాలపై విచారణకు సిద్ధమా?

రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి సంస్థ 11 వేల కోట్ల ఒప్పందం చేసుకుందని కవిత చెప్పారు. ఒక మెగావాట్ విద్యుత్ కు అయ్యే ఖర్చుకు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. అదే విధంగా లిథియం రిఫైనరీ అంటూ అల్ట్ మైన్ అనే చిన్న కంపెనీతో రూ. 2,250 కోట్ల ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. 27 లక్షలు కూడా ఆదాయం లేని సంస్థతో ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. సింగరేణి ఓబీ కాంట్రాక్టర్లు, నాయకులు, అధికారులు, సింగరేణిలో బొగ్గు మింగిన వాళ్లపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.