తెలంగాణలో భూసార హెల్త్ కార్డ్.. ఏ పంట ఎపుడు వేయాలో చెప్పేందుకు వాలింటర్లు

తెలంగాణలో భూసార హెల్త్ కార్డ్.. ఏ పంట ఎపుడు వేయాలో చెప్పేందుకు వాలింటర్లు


భూసార పరీక్షల ఆధారంగా రైతులకు పంటల ఎంపికపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించేందుకు ప్రభుత్వం ‘భూసార హెల్త్ కార్డు’ను కీలకంగా తీసుకొస్తోంది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. మొదట పైలట్ ప్రాజెక్ట్‌‌గా కొడంగల్ నియోజకవర్గంలో 128 మంది వలంటీర్లకు ఈ నెల 6న ఇక్రిశాట్‌‌లో ట్రైనింగ్ నిర్వహించనున్నారు. మట్టి నమూనాల సేకరణలో పాటించాల్సిన పద్ధతులు, విశ్లేషణా విధానాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నారు. అనంతరం ఈ నెల 8 నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మరో 1000 మందికి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. దశలవారీగా మొత్తం 30 వేల మంది వలంటీర్లకు శిక్షణ పూర్తి చేసి, గ్రామాల వారీగా పంపాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. మట్టి నమూనాలు సేకరించే సమయంలో జియో ట్యాగింగ్ వంటి ఆధునిక విధానాలను కూడా వినియోగించనున్నారు. శిక్షణ పొందిన వలంటీర్లు గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండి సాగు సలహాలు ఇవ్వనున్నారని అధికారులు చెప్తున్నారు. 

ముఖ్యంగా భూసార హెల్త్ కార్డులు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించనున్నాయి. మట్టి పరీక్ష ఫలితాల ఆధారంగా ఏ పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుందో స్పష్టంగా సూచనలు ఇవ్వనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వినియోగంతో భూమి నిస్సారమవుతున్న తరుణంలో ఈ నివేదికలు రైతులకు దిక్సూచిలా పని చేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. భూమిలో ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకోవడం వల్ల అవసరానికి మించి యూరియా, డిఏపీ వంటి ఎరువులు వాడాల్సిన అవసరం తగ్గుతుంది. దీంతో రైతుల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, ఇనుము వంటి లోపాలను గుర్తించి సరిచేయడం వల్ల పంట నాణ్యత, దిగుబడి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.