నిర్మల్ జిల్లా బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ,జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రూ.225 కోట్లతో ఈ అభివృద్ధి పనులు. వేద వ్యాస మహర్షి స్వయంగా ఇసుకతో ప్రతిష్టించిన ముగ్గురమ్మల (సరస్వతి, లక్ష్మి, కాళీ) ఆలయం, భక్తుల సౌకర్యార్థం సకల హంగులతో రూపుదిద్దుకోనుంది.
ముగ్గురమ్మల కొలువు..
కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ప్రశాంతత కోరి గోదావరి తీరానికి విచ్చేసిన వేద వ్యాస మహర్షి.. బాసరలో ఇసుకతో జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి మూర్తులను ప్రతిష్టించారని స్థల పురాణం చెబుతోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది. ముఖ్యంగా వసంత పంచమి, దేవీ నవరాత్రులు, చిన్నారుల అక్షరాభ్యాసాల సమయంలో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయం అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించింది.
శృంగేరి పీఠం ఆశీస్సులతో మాస్టర్ ప్లాన్..
ఆలయ పునర్నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా శృంగేరి పీఠాధిపతుల సంప్రదింపులతో తుది ప్రణాళిక సిద్ధం చేశారు. గర్భాలయం, అర్థ మండపం, గోపురాలు, మాడ వీధుల నిర్మాణానికి వారి అనుమతులు తీసుకున్నారు. ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయ పరిధిని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఆలయానికి ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురాన్ని, మిగిలిన మూడు దిశల్లో 7 అంతస్తుల గోపురాలను నిర్మించనున్నారు. 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాఢ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు.
►ALSO READ | నీళ్లు లేవు.. నెట్ వర్క్ లేదు.. 4 రోజులు దట్టమైన అడవిలో శరణ్య ఎలా ఉంది.. ఎట్టకేలకు దొరికిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని..!
మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. నిర్మాణాలన్నీ శిలలతో (రాతితో) జరగడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. 6 వేల మంది ఒకేసారి వేచి ఉండేలా అన్ని వసతులతో (ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితరాలతో) 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్‌లు, 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు.. తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, సోలార్ రూప్‌టాప్‌తో వెహికల్స్ పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో పుష్పవనం పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్‌లో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో ఆలరారేలా మొక్కలు నాటనున్నారు.
