‘మా ఆయనకు 40 ఏళ్లు.. నాకు 19 ఏళ్లు.. మా ఆయనతో కలిసి ఉండలేను.. లవర్తో ఉంటా’ అని కోర్టుకు తెగేసి చెప్పిన భార్య.. విచారణ అనంతరం ఆమె లవర్తో కలిసి ఉండేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్.. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఇదే జరిగింది. అవ్దేష్ అనే వ్యక్తి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.
తనకు పెళ్లై దాదాపు ఏడాది అయిందని, తన భార్య తనతో కాకుండా అనూజ్ కుమార్ అనే మరొకరితో అక్రమంగా కలిసి ఉంటోందని పిటిషన్లో అవ్ దేష్ కోర్టుకు వివరించాడు. తన భార్యను తన చెంతకు చేర్చాలని అభ్యర్థించాడు. కోర్టు ఆదేశాలతో అవ్ దేష్ భార్యను పోలీసులు వెతికారు. కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆమెను విచారిస్తున్న సమయంలో ఆమె భర్త, లవర్, ఆమె తల్లిదండ్రులు కోర్టులోనే ఉన్నారు.
భర్త ఉండగా ఎందుకు ఇలా చేశావమ్మా అని జడ్జి అడిగితే.. ఎలాంటి మొహమాటం లేకుండా ఒక విషయాన్ని సదరు వివాహిత కోర్టుకు స్పష్టం చేసింది. తనకు 19 సంవత్సరాల వయసు ఉందని, తన భర్తకు 40 ఏళ్ల వయసు ఉందని.. ఏజ్ గ్యాప్ కారణంగా తమ మధ్య వైవాహిక బంధం ఆశించిన విధంగా లేదని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తన వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు లేకుండా పోయాయని, తనతో తన భర్త, అతని కుటుంబం అమర్యాదగా ప్రవర్తిస్తుందని ఆమె కోర్టుకు తెలిపింది. అందుకే అక్కడ ఉండలేక తన ప్రియుడు అనూజ్ కుమార్తో కలిసి ఉంటున్నానని ఆమె చెప్పింది. కోర్టు ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వాలని తెలిపింది. అయితే.. ఎలాంటి కౌన్సెలింగ్ ఆమె మనసును మార్చలేకపోయింది.
కౌన్సెలింగ్ సెషన్స్ తర్వాత కూడా ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టి చెప్పింది. తన ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. ఆమె ప్రియుడు కూడా జీవితాంతం ఆమెను కష్టపెట్టకుండా చూసుకుంటానని న్యాయస్థానం ముందు హామీ ఇచ్చాడు. ఈ వాదనలన్నీ విన్న తర్వాత జస్టిస్ ఆనంద్ పాతక్, జస్టిస్ పుష్పేంద్ర యాదవ్ డివిజన్ బెంచ్ ఆమె అభిప్రాయానికి విలువ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఆమె ఎలాంటి అక్రమ నిర్భంధంలో లేదని స్పష్టం చేసిన కోర్టు సదరు పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్కు విలువ లేదని తెలిపింది.
ఆమె తన లవర్తో ఉండేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక అడల్ట్కు ఎవరితో కలిసి ఉండాలనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు ఉందని న్యాయస్థానం తెలిపింది. అయితే.. ఆరు నెలల పాటు ఆ మహిళ భద్రత, యోగక్షేమాలను సమీక్షించాలని ‘‘శౌర్య దీదీ’’ అనే అధికారుల బృందానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆమె తన లవర్తో సంతోషంగా ఉందో.. లేదో తెలుసుకుని కోర్టుకు నివేదించాలని సూచించింది.
