భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులఅరెస్టు దుర్మార్గం..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులఅరెస్టు దుర్మార్గం..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం..  భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి(బీజీయూఎస్) సభ్యులను అరెస్టు చేయడం దుర్మార్గమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణ మొదలుకుని నిమజ్జనం వరకు క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో బీజీయూఎస్ 47 ఏండ్లుగా కీలకపాత్ర పోషిస్తోందన్నారు.

ప్రభుత్వానికి, పోలీసులు, వివిధ శాఖలకు సహకరిస్తూ.. లక్షలాది మంది భక్తులు పాల్గొనే నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పనిచేస్తోందని చెప్పారు. ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిమజ్జనానికి సంబంధించిన అంశాన్ని గణేశ్ ఉత్సవ సమితి ముందుగానే అధికారుల దృష్టికి తీసుకెళ్లిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం సరైన సమయంలో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపడంలో విఫలమైందని ఆరోపించారు.

న్యాయపరమైన అంశాలు ఉన్నప్పుడు ఉత్సవ సమితితో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్న కేంద్ర మంత్రి.. నిమజ్జనానికి  కొద్ది రోజుల ముందు ఆంక్షలు విధించడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. సెప్టెంబర్ 25న జరిగే గణేశ్ నిమజ్జనం కోసం అవసరమైన క్రేన్లు, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు.