ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వీలైనంత త్వరగా ముగించాలన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. విచారణకు పిలవడం తప్పన్నట్లు కేటీఆర్ మాట్లాడారని అన్నారు.. ట్యాపింగ్ కేసును పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్నారు కాబట్టి సిట్ విచారణకు పిలిచిందని.. విచారణకు పిలిస్తే ఎవరైనా పోక తప్పదన్నారు. సిట్ పిలిస్తే తాను కూడా విచారణకు వెళ్తనన్నారు కవిత. చట్టానికి ఎవరూ చుట్టం కాదన్నారు . కాంగ్రెస్ తో గుంటనక్క హరీశ్ రావు కుమ్మక్కయ్యారని ఆరోపించారు కవిత.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మంచోళ్ళు అయినా చెడ్డవాళ్ళు ఐనా పొడుగోడైనా... పొట్టొడైనా కారు గుర్తుపై ఓటు వేయాలని కేటీఆర్ చెప్తున్నారు. చెడ్డ వాళ్ళకి ఓటు వేయాలని కేటీఆర్ చెప్తున్నారా.? అని ప్రశ్నించారు కవిత. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదు గుణం చూసి ఓటేయండి. పైసలు కాదు పని చేసేవాడికి ఓటు వేయాలన్నారు. మంచి అభ్యర్థులకు ఓటు వేయాలని.. తెలంగాణ జాగృతి తరఫున పలువురు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తున్నారని చెప్పారు కవిత.
తెలుగింటి ఆడబిడ్డ అయిన నిర్మలాసీతారమన్ మరోసారి బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడుల పేరుతో ఫేక్ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటుందని..వాటిని బహిర్గతం చేయాలన్నారు కవిత. హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. గంజాయి ముఠా దాడులకు పాల్పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫిబ్రవరి 20 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం చేపడుతుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాపై ప్రశ్నిస్తామని చెప్పారు.
