ప్రేమ పేరుతో ట్రాప్.. వీడియోలు తీసి బ్లాక్​మెయిల్

 ప్రేమ పేరుతో ట్రాప్.. వీడియోలు తీసి బ్లాక్​మెయిల్

నారాయణగూడ, వెలుగు: ప్రేమ పేరుతో ఓ యువతిని ట్రాప్​ చేసిన యువకుడు, ఆమెను మరొకరితో ఏకాంతంగా గడిపేలా చేశాడు. ఆ టైంలో వీడియోలు తీసి  వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీనివాస్, బాధితురాలి కథనం ప్రకారం.. బొల్లారం ఏరియాకు చెందిన యువతి నారాయణగూడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ ఫస్ట్​ఇయర్ చదువుతోంది. చెన్నైకి చెందిన బీటెక్​ఫైనలియర్ స్టూడెంట్ పూర్ణేశ్​యాదవ్ ఏడు  నెలల కిందట ఇన్​స్టాగ్రామ్​ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, యువతి చదువుతున్న కాలేజీలో ఆమెకు క్లాస్​మేట్ అయిన అస్లాం.. పూర్ణేశ్ యాదవ్​కు ఇన్​స్టాగ్రామ్​లో మ్యూచువల్​ ఫ్రెండ్. తనకు అర్జెంట్​గా డబ్బులు కావాలని పూర్ణేశ్ ఇటీవల యువతిని అడిగాడు. తన దగ్గర డబ్బు లేవని ఆమె చెప్పగా, అస్లాంను అడగమని పూర్ణేశ్ సలహా ఇచ్చాడు. దీంతో ఆమె అస్లాంను డబ్బు అడిగింది. తన దగ్గర కూడా డబ్బు లేదని, తన ఫ్రెండ్ సాయిచరణ్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడని.. ఎంత డబ్బు కావాలన్న ఇస్తాడని అస్లాం ఆమెతో చెప్పాడు. కానీ అందుకు సాయిచరణ్​తో ఏకాంతంగా గడపాల్సి ఉంటుందని కండిషన్​పెట్టాడు. అందుకు యువతి ఒప్పుకుంది. ఈ నెల 3న నారాయణగూడ విఠల్​వాడిలోని ఓయో రూమ్​లో సాయిచరణ్, యువతి ఏకాంతంగా గడిపారు. 

అదే రూమ్​లో వారికి తెలియకుండా దాక్కున్న అస్లాం.. వీడియో తీసి యువతి లవర్ పూర్ణేశ్ వాట్సాప్​కు పంపాడు. తర్వాత పూర్ణేశ్ ఆ వీడియోను యువతికి పంపించి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలు తన దగ్గర డబ్బు లేదని చెప్పగా.. పూర్ణేశ్ ఆ వీడియోను ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరికి, ఫ్రెండ్స్​కు పంపించాడు. దీంతో బాధితురాలు  షీటీమ్స్​ను ఆశ్రయించింది. షీ టీమ్స్​సిఫార్సు మేరకు నారాయణగూడ పోలీసులు కేసును స్వీకరించారు. యువతి కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేశారు. అస్లాం, సాయిచరణ్ విచారణకు రావాలని 41సీఆర్పీసీ కింద బుధవారం నోటీసులు జారీ చేశారు. చెన్నైలో ఉండే పూర్ణేశ్ యాదవ్​కు సైతం నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.