గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మసాలా దోశ: అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు!

 గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మసాలా దోశ: అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు!

దక్షిణ భారతీయులకి అత్యంత ఇష్టమైన టిఫిన్ దోశ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. బియ్యం, మినప్పప్పుతో చేసే ఈ కరకరలాడే దోశ, ఇప్పుడు విదేశీయుల మనసు కూడా గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 'టేస్ట్ అట్లాస్' అనే సంస్థ, మే 2026కు సంబంధించి ప్రపంచంలోని 50 అత్యుత్తమ పాన్‌కేక్‌ల అంటే పెనం మీద వేసే రొట్టెలు/వంటకాల లిస్ట్ విడుదల చేసింది. ఇందులో మన దోశకు అగ్రస్థానాల్లో చోటు దక్కింది.

మసాలా దోశ: 4.3 రేటింగ్‌తో ప్రపంచంలోనే 6వ స్థానంలో నిలిచింది. ఉప్పగా ఉండే పాన్‌కేక్‌లలో ఇదే టాప్‌లో ఉండటం విశేషం.

సాధారణ దోశ: 4.2 రేటింగ్‌తో 15వ స్థానం దక్కించుకుంది.

పెసరట్టు దోశ: కరకరలాడే ఈ దోశ 4.1 రేటింగ్‌తో 35వ స్థానంలో నిలిచింది.

దోశ ప్రత్యేకత ఏంటి 
సాధారణంగా విదేశాల్లో పాన్‌కేక్‌లు అంటే తీపిగా ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ మన దోశ పులియబెట్టిన పిండితో, కొంచెం పుల్లగా, కరకరలాడుతూ, కమ్మని మసాలా బంగాళదుంప కూరతో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. చట్నీ, సాంబార్‌తో వడ్డించే ఈ వంటకం ఇప్పుడు ఒక గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది.

టాప్-5లో ఉన్న ఇతర దేశాల వంటకాలు:
ప్రపంచవ్యాప్తంగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచినవి ఇవే:
*కార్టుపెలు పంకుకాస్ (లాట్వియా) - 1వ స్థానం
*క్రేప్స్ సుక్రీస్ (ఫ్రాన్స్) - 2వ స్థానం
*ఫ్రెంచ్ క్రేప్స్ (ఫ్రాన్స్) - 3వ స్థానం
*నూటెల్లా క్రేప్స్ (ఫ్రాన్స్) - 4వ స్థానం
*జియాన్‌బింగ్ (చైనా) - 5వ స్థానం

చివరగా.. మన ఊరి హోటల్ నుంచి ఫైవ్ స్టార్ రెస్టారెంట్ వరకు దొరికే దోశ, ఇప్పుడు ప్రపంచంలోని మేటి వంటకాలతో పోటీ పడి గెలవడం భారతీయులందరికీ గర్వకారణం.  మన దోశకు వచ్చిన ఈ గుర్తింపు, భారతీయ వంటకాల గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.