హైదరాబాద్, వెలుగు: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి విరిచిందని సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఒక్కసారిగా 30 నుంచి 35 శాతం వరకు ధరలు పెంచడం వల్ల హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లతోపాటు వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలు ముగిసిన వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో కమర్షియల్ గ్యాస్ ధరలు రూ.3 వేల మార్కును దాటే ప్రమాదం ఉందని, దీని వల్ల చిన్న వ్యాపారాలు దెబ్బతిని, ఆ ప్రభావం చివరికి వినియోగదారులపై పడ్తుందని హెచ్చరించారు. అందువల్ల వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
