ఆసీస్ వన్డే కెప్టెన్గా పాట్ కమ్మిన్స్

ఆసీస్ వన్డే కెప్టెన్గా పాట్ కమ్మిన్స్

ఆసీస్ వన్డే టీమ్ కెప్టెన్గా పాట్ కమ్మిన్స్ ఎంపికయ్యాడు. వన్డే కెప్టెన్సీ పగ్గాలను ఎవరికి అప్పగించాలనే విషయంపై కొద్దిరోజులుగా సాగుతోన్న అనిశ్చిత పరిస్థితులకు క్రికెట్ ఆస్ట్రేలియా తెర దించింది. కమ్మిన్స్‌ను వన్డే కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. వార్నర్, స్టీవ్ స్మిత్ పేర్లు వినిపించినా...చివరకు కమ్మిన్స్ వైపే సీఏ మొగ్గుచూపింది. 

టెస్టు కెప్టెన్కే వన్డే పగ్గాలు..
పాట్ కమ్మిన్స్ ఇప్పటికే టెస్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. దీనికి తోడు టెస్టుల్లో అతను జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వన్డే సారథ్య బాధ్యతలను కూడా కమ్మిన్స్కే అప్పగిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. 1957లో రే లిండ్‌వాల్ అనే ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత బౌలర్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించలేదు. అయితే వైస్ కెప్టెన్ ఎవరనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించే అవకాశాలున్నాయి. 

బౌలర్కు పగ్గాలు అప్పగించడం రెండోసారి...
బౌలర్ అయిన పాట్ కమ్మిన్స్కు జట్టు పగ్గాలు అప్పగించడం ద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా నూతన శకానికినాంది పలికినట్లైంది. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఫాస్ట్ బౌలర్ను కెప్టెన్గా నియమించడం ఇది రెండోసారి.  మొత్తంగా ఆస్ట్రేలియా జట్టు 27వ సారథిగా పాట్ కమ్మిన్స్ నియమితుడయ్యాడు. త్వరలోనే కమ్మిన్స్ వన్డే బాధ్యతలను తీసుకుంటాడు. అటు టీ20 కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్‌ కొనసాగుతున్నాడు. అయితే..టీ20 వరల్డ్ కప్ తర్వాత కూడా..ఈ బాధ్యతలను కమ్మిన్స్కే అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

కమ్మిన్స్ కెప్టెన్సీలో యాషెస్ సిరీస్..
2021 మార్చిలో పాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతని కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా  యాషెస్ సిరీస్‌ను గెలుచుకుంది. అటు కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన కమ్మిన్స్...టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్ట్, టీ20, వన్డేల్లో మేటి బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 73 వన్డేల్లో 119 వికెట్లను పడగొట్టాడు. 43 టెస్టుల్లో 199 వికెట్లు, 46 టీ20ల్లో 52 వికెట్లు పడగొట్టాడు.