ప్రాజెక్టుల బకాయి బిల్లులు పేరుకుపోతున్నాయి

ప్రాజెక్టుల బకాయి బిల్లులు పేరుకుపోతున్నాయి
  • కాళేశ్వరం, పాలమూరు స్కీంలకు చెల్లించాల్సిందే
  • ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇరిగేషన్ కు రూ.12,832 కోట్ల ఖర్చు

హైదరాబాద్‌‌, వెలుగు: సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్‌‌ బిల్లులు కొండలా పేరుకుపోతున్నాయి. సర్కార్ టైమ్​కు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టుల పనులు స్లో అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్‌‌ చివరి నాటికి అన్ని ప్రాజెక్టులకు కలిపి రూ.7,583 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ స్కీంలకు చెల్లించాల్సిందే ఇందులో మూడో వంతు ఉంది. సీతారామ, ఎల్లంపల్లి, డిండి ఎత్తిపోతలు వాటి తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఈ ఫైనాన్స్‌‌ ఇయర్‌‌లో ఇప్పటి వరకు ప్రాజెక్టుల కోసం రూ.12,832 కోట్లు ఖర్చు చేశారు. ఉమ్మడి ఏపీలో చేసిన ప్రాణహిత ప్రాజెక్టు పనుల బిల్లులే రూ.274 కోట్ల ఇంకా చెల్లించలేదు. మైనర్‌‌ ఇరిగేషన్‌‌ కింద మిషన్‌‌ కాకతీయ బకాయిలు, ఇతర బిల్లులు ఇంకో రూ.500 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. వీటిని కలుపుకుంటే ఇరిగేషన్‌‌ పెండింగ్‌‌ బకాయిలు రూ.8 వేల కోట్లకు పైగా ఉన్నాయి.
సగానికి పైగా కాళేశ్వరం ఖర్చే
ఇప్పటి వరకు రూ.12,832 కోట్లు ఖర్చు చేయగా అందులో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే రూ.7,133.29 కోట్లు వెచ్చించారు. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్‌‌ ద్వారా తీసుకున్న అప్పుల నుంచి 5,651.7 కోట్లు, బడ్జెట్‌‌ నుంచి రూ.1,481.59 కోట్లు ఖర్చు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు 3,714.13 కోట్లు ఖర్చు చేయగా ఇందులో అప్పులు రూ.2,634.32 కోట్లు కాగా బడ్జెట్‌‌ నుంచి రూ.1,079.98 కోట్లు వెచ్చించారు. దేవాదుల ఎత్తిపోతలకు లోన్‌‌ల ద్వారా రూ.247.22 కోట్లు, బడ్జెట్‌‌ నుంచి రూ.11.80 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు లోన్‌‌ల ద్వారా రూ.292.25 కోట్లు, బడ్జెట్‌‌ నుంచి రూ.73.52 కోట్లు, వరద కాలువకు లోన్‌‌ల ద్వారా రూ.464.73 కోట్లు, బడ్జెట్‌‌ నుంచి రూ.78.97 కోట్లు ఖర్చు చేశారు.