న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ గత మూడు వారాలుగా రష్యా నుంచి ఎటువంటి ముడి చమురు దిగుమతి చేసుకోలేదని స్పష్టం చేసింది. ఈనెలలోనూ రష్యా చమురు వచ్చే అవకాశం లేదని కంపెనీ తెలిపింది. యూరోపియన్ యూనియన్ ఆంక్షలను పాటించడంలో భాగంగా 2025 నవంబర్ 20 నుంచే జామ్నగర్ ఎగుమతి యూనిట్ లో రష్యా చమురు వాడకాన్ని నిలిపివేసింది. రష్యా నుంచి చమురు వస్తోందని వచ్చిన వార్తలను రిలయన్స్ ఖండించింది. గతంలో రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేసిన సంస్థగా రిలయన్స్ నిలిచింది. డిసెంబర్ ఒకటి నుంచి సెజ్ రిఫైనరీ నుంచి జరిగే ఎగుమతుల్లో రష్యా ముడి చమురు వాటా లేదని వివరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ కు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రిలయన్స్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
