డబుల్ రోల్!.. సీఎంగా, పీసీసీ చీఫ్ గా దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి

డబుల్ రోల్!.. సీఎంగా, పీసీసీ చీఫ్ గా దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి

అతనొక్కడే.. కానీ రెండు పాత్రల్లో దూసుకుపోతున్నారు. పార్టీని, పాలనను సమన్వయం చేసుకుంటూ లోక్ సభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇంటి నుంచే తన పని కానిచ్చేస్తున్నారు.  వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి, కరెంటు కోతలు ఉండకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరో వైపు తన నివాసాన్ని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ కేకే, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు ప్రస్తుత వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను తన నివాసంలోనే పార్టీలో చేర్చుకున్నారు. 

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలాబలాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని దానికి అనుగుణంగా కార్యాచరణకు దిగుతున్నారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లోని కీలక నేతలకు ప్రభుత్వ సలహాదారు, పార్టీ నేత వేం నరేందర్ రెడ్డి ద్వారా రాయబారం పంపుతున్నారు. వారితో చర్చలు జరిపాక తన నివాసానికి పిలిచి పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇవాళ మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేతల కూన శ్రీశైలం గౌడ్ తో వేం నరేందర్ రెడ్డి ఇతర నేతలు చర్చించిన తర్వాత తన నివాసంలోనే పార్టీ కండువా కప్పేశారు. 

గాంధీ భ‌వన్‎కు కూడా అడ‌పాద‌డ‌పా వెళ్తున్న ముఖ్యమంత్రి మొత్తం వ్యవహరాన్ని ఇంటి నుంచే కొనసాగిస్తున్నారు. ఇక ఎంపీల నుంచి  మండ‌ల స్థాయి నేత‌ల వ‌ర‌కు అన్ని స‌మావేశాలూ ఇంటి నుండే నిర్వహిస్తున్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ రేపు చేపట్టే సభకు సంబంధించిన ఏర్పాట్లనూ ఇంటి నుండే ప‌ర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో 14 లోక్ సభ సీట్లలో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు.  గెలుపు కోసం మండల స్థాయి మొదలు  పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుల వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.  పార్ల‌మెంట్ ఎన్నికల్లోనూ ప‌ట్టు సాధించి పార్టీ అధిష్టానానికి మరో మారు తన సత్తా చూపాలని ప్రయత్నిస్తున్నారు.