వెంకటాపురం, వెలుగు: తెలంగాణ – ఛత్తీస్ఘడ్ సరిహద్దులు కర్రెగుటల్లో నిర్మిస్తున్న రహదారి పనులను నాణ్యతగా చేపట్టాలని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశించారు. ఆదివారం కర్రెగుటల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కర్రె గుట్టలలో ఉన్న జల్ల, డోలీ గ్రామాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో మావోయిస్టు కంచుకోటగా ఉన్న ప్రాంతం కావటం, రహదారి నిర్మాణంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రి, పగళ్లు గస్తీ కాస్తున్న భద్రతా సిబ్బంది సేవలను ప్రశంసించారు.
వేసవి ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతుండడంతో ప్రత్యేక రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. పామునూరు నుంచి జల్ల, డోలీ రోడ్డు నిర్మాణం రానున్న రెండు నెలల్లో నిర్మించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, వెంకటాపురం సీఐ రమేశ్, సివిల్ సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

