ఆరుగాలం కష్టపడి పండించిన పంట బుగ్గిపాలైంది. అప్పులు చేసి పండించిన పంట కనీసం వడ్డీలు కూడా తీర్చకుండా కళ్లముందే బూడిదైపోయింది. ఒకటి కాడు రెండు.. 15 ఎకరాల పంట మంటల్లో కాలిపోవడంతో నేల తల్లిని నమ్ముకున్న రైతులకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగలలేదు.
మహబూబాబాద్ జిల్లాలో 2026 ఏప్రిల్ 27వ తేదీన ఆరు మంది రైతులకు చెందిన మొక్కజొన్న చేను కాలి బూడిదైపోయింది. కొందరు చేను ఏరి కుప్పగా పోశారు.. ఇంకొందరు ఏరాల్సి ఉంది.. కుప్పలో ఉన్నవి.. చేనుకు ఉన్న కంకులూ అన్నీ మంటల్లో కలిసిపోయాయి.
కేసముద్రం మండలం తాళ్ళుపూసపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 15 ఎకరాల మొక్క జొన్న చేను దగ్ధం అయ్యింది. మంటలు చేనంతా వ్యాపించి భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. బిందెలతో బకెట్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేయడంతో.. మరిన్ని చేలకు అంటుకోకుండా మంటలు ఆర్పారు.ఈ ప్రమాదంలో లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు చెబుతున్నారు. నష్టపోయిన రైతులును ఆదుకోవాలంటూ మొక్కజొన్న రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

