‘హ్యారిపోటర్’ నటుడు రాబీ కోల్ట్రేన్ మృతి

‘హ్యారిపోటర్’ నటుడు రాబీ కోల్ట్రేన్ మృతి

నటనతో అలరిస్తూ.. ప్రపంచ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ హాలీవుడ్‌ నటుడు రాబీ కోల్ట్రేన్‌(72) కన్నుమూశారు. స్కాట్లాండ్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రాబీ మృతితో హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం ఏర్పడింది. 

ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలైన హ్యారి పోటర్ సినిమాల్లో హాగ్రిడ్ వంటి పాత్రలు, టీవీ సిరీస్ క్రాకర్ లో నేరాలను పరిష్కరించే మనస్తత్వ వేత్తగా  రాబీ కోల్ల్రేన్‌ మంచి గుర్తింపు పొందారు.  థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన రాబి కోల్రేన్ ‘ఫ్లాష్ గార్డాన్’ మూవీతో వెండితెరపైకి వచ్చారు. 1990లో వచ్చిన టీవీ సిరీస్ క్రాకర్ లో హార్డ్ బీటెన్ డిటెక్టివ్ గా గుర్తింపు సంపాదించారు. వయసు మీద పడినా నటనా పరంగా నిత్యం తనను తాను మెరుగులు దిద్దుకుంటూ ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయే విధంగా తనను తాను మలచుకునే దిగ్గజ నటుడిగా పేరు పొందారు. 

ముఖ్యంగా జేమ్స్ బాండ్ సిరీస్ లోని రెండు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన రాబీ వరుసగా మూడుసార్లు ఉత్తమ నటుడిగా బ్రిటీష్ అకాడమీ టెలివిజన్  (BAFTA TV)ట అవార్డులు కైవసం చేసుకున్నారు. 2001 నుంచి 2011 మధ్య  ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ అయిన హ్యారీ పోటర్ చిత్రాలలో బాల మాంత్రికుడికి గురవుగా .. స్నేహితుడిగా వ్యవహరించే సున్నితమైన హాఫ్ జెయింట్ పాత్ర ద్వారా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 

రాబీ మృతి చెందడానికి గల కారణాలు తెలియరాలేదు కానీ..ఆయన మరణం పట్ల హాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  హ్యారీ పోటర్ రచయిత జేకే రౌలింగ్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. “ రాబీ లాంటి వ్యక్తిని నేను మరలా ఎప్పటికీ కలుసుకోలేను. ఆయన చాలా అద్భుతమైన ప్రతిభావంతుడు. ఆయనతో కలిసి పని చేసే అవకాశం.. కానీ మళ్లీ తనను కలుసుకునే అదృష్టం లేకుండా పోయింది.   ఆయన కుటుంబానికి,  పిల్లలందరికీ నా ప్రగాఢ సానుభూతి.” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. 

రాబీ కోల్ట్రేన్ మృతితో.. రెస్ట్ ఇన్ పీస్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతూ.. దిగ్గజ నటుడికి ప్రపంచ వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు.