ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగియవచ్చు.. కానీ: ట్రంప్

ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగియవచ్చు.. కానీ: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగియవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం ముగింపుకు చేరుకుందని తెలిపారు. ఇరాన్‎కు నావికాదళం లేదు, కమ్యూనికేషన్లు లేవు, వైమానిక దళం లేదన్నారు. గత అంచనాలకు నాలుగైదు వారాల ముందే వార్ ఎండ్ అవుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ప్రపంచ చమురు సరఫరాకు ఇరాన్ అంతరాయం కలిగిస్తే  మాత్రం దాడులు భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు.

హోర్ముజ్ జలసంధిలో చమురు రవాణాను ఆపడానికి ఇరాన్ ఏదైనా చేస్తే.. ఇప్పటికంటే 20 రెట్లు ఎక్కువ శక్తితో దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సుప్రం లీడర్ అయతుల్లా మోజ్తాబా ఖమేనీ ఎన్నికపైన ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోజ్తాబా ఖమేనీ ఎంపిక విషయంలో ఇరాన్ పెద్ద తప్పు చేసిందన్నారు. మోజ్తాబా ఎంపిక సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు.

 ఇరాన్ సుప్రీం లీడర్‎గా మోజ్తాబా బదులుగా తన మనసులో మరొకరు ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోజ్తాబా ఖమేనీ ఎంతకాలం పదవిలో కొనసాగుతారో తెలియదంటూ పరోక్షంగా అతడిని కూడా అంతం చేస్తామని సంకేతాలు ఇచ్చారు. కాగా, అయతొల్లా ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‎గా ఎన్నికైన విషయం తెలిసిందే. 

యుద్ధం ముగింపు మా చేతుల్లో ఉంది: ఐఆర్జీసీ

త్వరలో ఇరాన్ యుద్ధం ముగుస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కౌంటర్ ఇచ్చింది. యుద్ధం ముగింపు మా చేతుల్లో ఉందని పేర్కొంది. ఇరాన్ భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించేది తమ దేశ సాయుధ బలగాలని.. అమెరికా సైనికులు యుద్ధాన్ని ముగించలేరని కౌంటర్ ఇచ్చింది. ఇరాన్ శక్తికి మించి పోరాడుతోందని.. కానీ యుద్ధంలో అధిపత్యం సాధించామంటూ ట్రంప్ అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు అంతే ధీటుగా ప్రతి దాడులు చేస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది.