3 వేల కోట్లతో 3 లక్షల గొర్రెల యూనిట్లు

3 వేల కోట్లతో 3 లక్షల గొర్రెల యూనిట్లు


హైదరాబాద్, వెలుగు: గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా గొల్లకురుమలు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో రెండో దఫా కింద 3 లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని ప్రకటించింది. 2017లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 3 లక్షల 66 వేల 797 మంది లబ్ధిదారులకు 77 లక్షల 2 వేల 737 గొర్రెలను పంపిణీ చేసింది. సర్కారు ప్రకటించిన 7 లక్షల యూనిట్లలో ఇప్పటి వరకూ సగమే పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో రూ.3,000 కోట్లతో మరో 3 లక్షల యూనిట్ల గొర్రెలను రెండో దఫా కింద గొల్లకురుమలకు అందించబోతున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించినా బడ్జెట్లో నిధుల కేటాయింపు విషయం మాత్రం ప్రకటించలేదు. ఇప్పటి వరకు గొర్రెల పంపిణీ కోసం కేటాయించిన రూ.4,584 కోట్లను ఎన్సీడీసీ ద్వారా రుణాలు తీసుకుని పంపిణీ చేసింది. ఇప్పుడు ప్రకటించిన 3 లక్షల యూనిట్ల కోసం కూడా రూ.3,000 కోట్లు రుణాలు తీసుకుని పంపిణీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

పశుసంవర్థక శాఖ, ఫిషరీస్కు 1,730 కోట్లు

పశుసంవర్థక శాఖ, ఫిషరీస్కు బడ్జెట్లో రూ.1,730 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో ఎక్కువ శాతం నిర్వహణ కోసమే. ప్రగతి పద్దులో రూ.233.81కోట్లు కేటాయించారు. పశుసంవర్థక శాఖకు సంబంధించిన స్టేట్ సెక్టార్ స్కీమ్ కోసం రూ.185.24 కోట్లు, కేంద్ర పథకాల్లో స్టేట్ మ్యాచింగ్ వాటాకు రూ.19.42 కోట్లు ఇచ్చారు. ఫిషరీస్ శాఖకు రూ.16.15 కోట్లు కేటాయించగా, అందులో స్టేట్ స్కీమ్ కోసం రూ.7.65 కోట్లు, సెంట్రల్ పథకాల్లో స్టేట్ వాటా కోసం రూ.3.40 కోట్లు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కోసం రూ.5.10 కోట్లు కేటాయించారు. పాడి రైతుల ప్రోత్సాహంతోపాటు చేప పిల్లలు, రొయ్యలను జలాశయాల్లో వదిలే పథకాలు, డెయిరీ డెవలప్మెంట్ పథకాలకు మిగతా నిధులు కేటాయించే అవకాశం ఉంది.