కొత్త ఉద్యోగాలు.. ఆర్టీసీలో డ్రైవర్లుగా 894 మంది ..శ్రామిక్‌‌ పోస్టుల్లో 710 మంది నియామకం

కొత్త ఉద్యోగాలు.. ఆర్టీసీలో డ్రైవర్లుగా 894 మంది ..శ్రామిక్‌‌ పోస్టుల్లో  710  మంది నియామకం
  • సెలెక్షన్ లిస్ట్‌‌ విడుదల చేసిన టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌‌‌బీ 
  • వెబ్‌‌సైట్‌‌లో అభ్యర్థుల లిస్ట్ 

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఎంపికలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌బీ) సోమవారం ప్రకటించింది. 2025 సెప్టెంబర్ 17న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,743 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టగా ఇందులో వెయ్యి డ్రైవర్ పోస్టులకు గాను 894 మంది, 743 శ్రామిక్ పోస్టులకు గాను 16 మంది మహిళలు సహా మొత్తం 710 మంది ఎంపికయ్యారు. ఈ రెండు పోస్టులకు సంబంధించి మరో 139 పోస్టులు భర్తీ కాలేదని టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌బీ చైర్మన్‌‌ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

డ్రైవర్ పోస్టులకు వెయిటేజ్ మార్కులు, డ్రైవింగ్ టెస్ట్ మార్కుల ఆధారంగా, శ్రామిక్ పోస్టులకు వెయిటేజ్ మార్కుల ఆధారంగా ఎంపికలు చేపట్టినట్టు పేర్కొన్నారు. మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన సర్టిఫికెట్ ధ్రువీకరణలో విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయో సడలింపు తదితర అంశాలను పరిశీలించిన అనంతరం తుది జాబితాను ఖరారు చేసినట్టు తెలిపారు.

అభ్యర్థుల లాగిన్‌‌ ఇలా 

ఎంపికైన అభ్యర్థులు తమ లాగిన్‌‌లో ఎంపిక వివరాలు, డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ మార్కుల షీట్, అలాగే పోస్టుల వారీగా ఎంపిక జాబితా తెలుసుకోవచ్చన్నారు. కటాఫ్ మార్కులు (చివరిగా ఎంపికైన అభ్యర్థి మార్కులు, జన్మతేదీతో సహా) www.tgprb.in వెబ్‌‌సైట్‌‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 7 ఉదయం 8 గంటల నుంచి 11 అర్ధరాత్రి వరకు టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌బీ వెబ్‌‌సైట్‌‌లో తమ లాగిన్ ద్వారా అటెస్టేషన్ ఫారం ఆన్‌‌లైన్‌‌లో పూర్తి చేయాలని తెలిపారు. 

ఆన్‌‌లైన్‌‌లో ఫారం పూర్తి చేసిన తర్వాత దాని మూడు కాపీలు తీసుకుని, నిర్ణీత చోట్ల సంతకాలు చేయడంతో పాటు రెండు పాస్‌‌పోర్ట్ సైజు ఫొటోలు అతికించి, గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ పొందాలన్నారు. సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో కలిసి ఈ నెల 17న ఎంపికైన రెవెన్యూ జిల్లాకు సంబంధించిన పాత పోలీసు జిల్లా లేదా పోలీస్‌‌ కమిషనరేట్ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.