ఇంట్లోనే హైబ్రిడ్ గంజాయి సాగు

ఇంట్లోనే హైబ్రిడ్ గంజాయి సాగు
  • ఆన్​లైన్​లో సీడ్స్​ కొని పూల కుండీల్లో పెంపకం

బషీర్‌బాగ్‌, వెలుగు: గంజాయికి అలవాటు పడ్డ ఇద్దరు యువకులు ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగుకు ప్లాన్​ చేశారు. ఆన్​లైన్​లో గంజాయి విత్తనాలు కొని పూలకుండీల్లో పెంపకం మొదలుపెట్టారు. చింతల్‌బస్తీ, శ్యామ్‌రావు నగర్‌లోని కేబీ అపార్ట్‌మెంట్స్‌లో ఈ వ్యవహారం నడుస్తుండగా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) ఎక్సైజ్ స్టేషన్ నాంపల్లి అధికారులు గుట్టు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి హైబ్రిడ్ గంజాయి మొక్కతో పాటు 12 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి సాగుకు వినియోగిస్తున్న పర్పుల్ హేజ్ గంజాయి విత్తనాలు, 150 వాట్స్ ఎల్ఈడీ గ్రో లైట్, టేబుల్ ఫ్యాన్, పీహెచ్ మీటర్, టెంపరేచర్​ మెషీన్​,ఇతర ఆధునిక పరికరాలను అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో న్యూఢిల్లీకి చెందిన ధ్రువ్ ఠాకూర్ (26), ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్పిత్ స్టీఫెన్ ప్రకాశ్(25)ను అరెస్టు చేశారు. ఆన్‌లైన్ ద్వారా గంజాయి విత్తనాలు కొనుగోలు చేసి, ఇంట్లోనే మొక్కను పెంచుతున్నట్లు నిందితులు అంగీకరించారు.