- ఇంత నిఘా, పర్యవేక్షణ యంత్రాంగం ఉన్నా పేపర్ ఎలా లీక్ అయింది?
- కేసు దర్యాప్తును కొంతకాలం మేమే పర్యవేక్షిస్తం
- పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలని హితవు
- ఆన్‌లైన్ విధానంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
- తదుపరి విచారణ జులై రెండో వారానికి వాయిదా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పేపర్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.‘‘యువతను మానసిక క్షోభకు గురిచేశారు. వారిని నిరాశపరచడం తగదు” అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)పై మండిపడింది. మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 2026 నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్‌పై జరుగుతున్న దర్యాప్తును తాము కొంతకాలం పాటు స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.
ఈ కేసుపై దాఖలైన పలు పిటిషన్లను శుక్రవారం జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇంత నిఘా, పర్యవేక్షణ యంత్రాంగాలు ఉన్నప్పటికీ అసలు పేపర్ ఎలా లీక్ అయిందో చెప్పాలని ఎన్టీఏను నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం తీవ్ర ఆందోళనతో ఉందని, ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు ప్రధాని మోదీ స్వయంగా ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. జూన్ 21న జరగబోయే ‘నీట్’ రీ-టెస్ట్ కోసం కొన్ని కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
- యూపీఎస్సీని చూసి నేర్చుకోండి
యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఎప్పుడూ ఇలాంటి ప్రశ్నపత్రాల లీకేజీలు జరగవని, దాన్ని చూసైనా నేర్చుకోవాలని ఎన్టీఏకు సుప్రీంకోర్టు సూచించింది. ‘‘ఇలాంటి ఘటనలు విద్యార్థులను తీవ్రమైన మానసిక వేదనకు గురిచేస్తాయి. మనం విద్యార్థుల నమ్మకాన్ని వమ్ము చేయలేం. ఇది కేవలం ఒక్క విద్యార్థికి సంబంధించిన విషయం కాదు.. ఒక కుటుంబం భావోద్వేగాలు, సమయం, ప్రేమ దీనితో ముడిపడి ఉంటాయి’’ అని జస్టిస్ పి.ఎస్. నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ సిఫార్సుల అమలుపై కోర్టు ఆరా తీసింది.
ఇంత పెద్ద కమిటీలు ఉన్నా లీకేజీ జరిగిందంటే.. సిఫార్సుల్లో లోపం ఉందా? లేదా వాటి అమలు సరిగ్గా జరగలేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. నీట్ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలోకి మార్చాలనే డిమాండ్లతో సహా పలు సవరణల పిటిషన్లపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది.
- పెళ్లి తర్వాత అవమానించడమెందుకు?
పెళ్లి తర్వాత వధువులను, వారి కుటుంబాలను వేధించే ధోరణి మారాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘అసలు అబ్బాయిలు అమ్మాయిలను పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత వారిని, వారి కుటుంబాలను అవమానించడం ఎందుకు? వధువును, ఆమె తల్లిదండ్రులను నిరంతరం అవమానించడం సాగదని సమాజానికి ఒక బలమైన సందేశం వెళ్లాలి’ అని స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వరకట్న వేధింపుల కేసులో.. నిందితుడైన భర్త తమ్ముడికి(మరిది) ఐపీసీ సెక్షన్ 498ఎ(క్రూరత్వం, వేధింపులు) కింద విధించిన శిక్షను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తోసిపుచ్చింది.
2010లో వివాహం జరగగా, తర్వాత మూడేళ్లకే ఓ మహిళ వరకట్న వేధింపుల కారణంగా తన అత్తవారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తక్కువ కట్నం ఇచ్చారంటూ వధువు తండ్రిని ‘యాచకులు’ అని నిందితులు అవమానించిన తీరుపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. కింది కోర్టులు విధించిన శిక్షను సమర్థిస్తూ నిందితుడి అప్పీల్‌ను కొట్టివేసింది.
- అన్ని ఎమర్జెన్సీ నంబర్లను ‘112’కు మార్చాలి
పౌరులకు సకాలంలో అత్యవసర వైద్యం (ట్రామా కేర్) అందడం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, యూటీలు తమ పరిధిలోని పోలీస్ (100), ఫైర్ (101), అంబులెన్స్ (102, 108), మహిళా హెల్ప్‌లైన్ (1091)లాంటి అన్ని అత్యవసర నంబర్లను మూడు నెలల్లోగా ఒకే ఒక్క నంబర్ ‘112’ లోకి అనుసంధానం చేయాలని ఆదేశించింది. బాధితులను ఆదుకునే వారి రక్షణ కోసం ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
