- ప్రతి ఐదు మరణాల్లోఒకటి మన రాష్ట్రంలోనే
- 2023లో 202 మంది మృతి
- యూపీ తర్వాత మన దగ్గరే ఎక్కువ మృతులు
- రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ఇండియా వెల్లడి
- 2023లో దేశవ్యాప్తంగా1,075 మంది బలి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టైఫాయిడ్ జ్వరం జనాల ప్రాణాల మీదికొస్తున్నది. కలుషిత నీళ్లు, ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్న కల్తీ ఫుడ్ తిని ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నరు. దేశవ్యాప్తంగా టైఫాయిడ్ తో చనిపోతున్న వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మన రాష్ట్రం నుంచే ఉంటున్నారు. 2023లో దేశవ్యాప్తంగా టైఫాయిడ్, పారా టైఫాయిడ్ వల్ల 1,075 మంది చనిపోతే, అందులో 202 మంది మన రాష్ట్రం వాళ్లే ఉన్నారు.
ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా డేటా రిలీజ్ చేసింది. జనాభాపరంగా చూస్తే మనది చిన్న రాష్ట్రమే అయినా, టైఫాయిడ్ చావుల్లో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ లో 2023లో 377 టైఫాయిడ్ మరణాలు నమోదై ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత 202 మరణాలతో మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్ లో 118 మంది, ఢిల్లీలో 36 మంది టైఫాయిడ్ కారణంగా చనిపోయారు. దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5 శాతమే అయినా.. టైఫాయిడ్ మరణాల్లో మాత్రం రాష్ట్రం వాటా 19 శాతంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. దేశంలో నమోదవుతున్న టైఫాయిడ్ కేసుల్లో ఐదో వంతు మన దగ్గరే రికార్డవుతున్నాయి.
మురికి నీళ్లు.. కల్తీ ఫుడ్
సిటీల్లో స్వచ్ఛమైన తాగునీరు దొరక్కపోవడం, మురికివాడల్లో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థలే టైఫాయిడ్ కు కారణమని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. దీనికితోడు రోడ్ల పక్కన దుమ్ముధూళిలో అమ్మే పానీపూరి, బజ్జీలు, ఇతర జంక్ ఫుడ్ తినడం వల్ల బ్యాక్టీరియా కడుపులోకి చేరి టైఫాయిడ్ కు దారితీస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వరద నీరు, డ్రైనేజీ నీరు కలిసిపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిర్మాణ పనులు జరిగే చోట్ల, స్లమ్ ఏరియాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది.
సొంత వైద్యం వద్దు...
జ్వరం రాగానే డాక్టర్లను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోవడం జనం ప్రాణాల మీదకు తెస్తోంది. వారం, పది రోజులైనా జ్వరం తగ్గకపోయినా అశ్రద్ధ చేస్తుండటంతో టైఫాయిడ్ బ్యాక్టీరియా ముదిరి పేగులకు రంధ్రాలు పడటం, ఇన్ఫెక్షన్ పాకడం వంటి సీరియస్ సమస్యలకు దారితీస్తోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చలితో కూడిన జ్వరం వారం పైబడి ఉండడం, విపరీతమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలని సూచిస్తున్నారు. చివరి దశలో ఆస్పత్రికి వస్తే నోటి ద్వారా వేసుకునే మందులు పనిచేయక, హైడోస్ సెలైన్ ట్రీట్ మెంట్ అందించాల్సి ఉంటుందని, అప్పటికే అవయవాలు దెబ్బతిని ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
