కృష్ణా నీటి వాటాలపై కర్నాటక, మహారాష్ట్ర కుట్రలు!

కృష్ణా నీటి వాటాలపై  కర్నాటక, మహారాష్ట్ర కుట్రలు!
  • 65 శాతం డిపెండబిలిటీ ఆధారంగా నీటి కేటాయింపులు చేసిన బ్రజేశ్ ట్రిబ్యునల్​
  • ప్రస్తుతం ట్రిబ్యునల్​లో మన రాష్ట్ర వాటా తేల్చే సెక్షన్ 3పై వాదనలు
  • ఇప్పుడు గెజిట్ ఇవ్వాలనడంపై మన రాష్ట్రం అభ్యంతరాలు

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్​లోని నీటివాటాలపై కర్నాటక, మహారాష్ట్ర కుట్రకు తెరలేపాయి. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి.. దిగువ రాష్ట్రాలకు నష్టం చేసిన కర్నాటక ఇప్పుడు కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్2 (కేడబ్ల్యూడీటీ 2/బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) అవార్డును అమలు చేయాలంటున్నది. 

మహారాష్ట్ర కూడా ఇదే వాదన వినిపిస్తున్నది. రెండు రాష్ట్రాలు దీనిపై ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాశాయి. అయితే, కృష్ణా బేసిన్​లో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలూ ఉన్నందున రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులతో కేంద్రం సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ నెల 7న సమావేశం నిర్వహించనుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వీలైనంత త్వరగా బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుపై గెజిట్ ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. కాగా, కర్నాటక, మహారాష్ట్ర తీరుపై మన ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. 

ట్రిబ్యునల్​లో వాదనలు నడుస్తున్నా..

ఒకవేళ కేంద్రం గెజిట్​ను జారీ చేస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. వాస్తవానికి ఉమ్మడి ఏపీకి కేటాయించిన గంపగుత్త జలాల్లో రెండు రాష్ట్రాల వాటా తేల్చాలంటూ ఎప్పటినుంచో తెలంగాణ వాదిస్తున్నది.

811 టీఎంసీల్లో.. ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకే 70 శాతం వరకు నీటి కేటాయింపులు చేయాలని చెబుతున్నది. అందులో భాగంగానే ప్రస్తుతం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ సెక్షన్ 3పై వాదనలను వింటున్నది. రెండు రాష్ట్రాల మధ్య వాటాలు తేల్చేందుకు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వాదనలు వింటున్న సమయంలోనే.. కర్ణాటక, మహారాష్ట్రలు ఇలాంటి వాదనలకు తెరలేపడం మంచిది కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం గెజిట్​ను ప్రచురిస్తే తెలంగాణ నీటి వాటాలపై మళ్లీ మొదటికే మోసం వచ్చే పరిస్థితులుంటాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ముందు మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వాదనను వినిపిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై అధికారులతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ సమావేశమై.. వివరాలు ఆరా తీసినట్టు తెలిసింది. ఏం చేయాలన్న దానిపై చర్చించినట్టు సమాచారం.

65 శాతం డిపెండబిలిటీ ఆధారంగా కేటాయింపులు

ఇప్పటిదాకా కృష్ణా బేసిన్​లోని రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ1) అవార్డు ప్రకారమే నీటి పంపిణీ జరుగుతున్నది. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఏపీలకు రిటర్న్ ఫ్లోస్ కలిపి 2,130 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్​ కేటాయించింది. అందులో 585 టీఎంసీలు మహారాష్ట్రకు, 734 టీఎంసీలు కర్ణాటకకు, 811 టీఎంసీలు ఉమ్మడి ఏపీలకు గంపగుత్త కేటాయింపులు చేసింది. ఇప్పటికీ అవే కేటాయింపులు నడుస్తున్నాయి. ఆ తర్వాత 2013 నవంబర్​లో బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్.. నీటి కేటాయింపులను రివైజ్ చేసింది. 65 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 2,578 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు కేటాయించింది. ఉమ్మడి ఏపీకి 1005 టీఎంసీలు, కర్ణాటక 907, మహారాష్ట్రకు 666 టీఎంసీల చొప్పున నీటిని కేటాయిస్తూ తీర్పును ఇచ్చింది. అయితే, దీనిపై గెజిట్ ప్రచురణ కాకపోవడంతో ఇప్పటికీ బచావత్ ట్రిబ్యునల్ అవార్డే అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తున్నది.