- కొత్తగూడెంలో మూడు రోజులపాటు సమావేశాలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు ఈనెల 23, 24, 25 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు వెల్లడించారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతులు అప్పుల బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మహాసభల్లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధర అమలు, పూర్తి రుణమాఫీ, పోడు సాగుదారులకు హక్కులు, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కౌలు రైతులకు గుర్తింపు వంటి అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, పి.జంగారెడ్డి, అరిబండి ప్రసాదరావు, వర్ణ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

