- అర్హత సాధించిన 39,673 మంది అభ్యర్థులు
- 60 ఏండ్లు పైబడిన వారు మొత్తం 348 మంది ఉత్తీర్ణత
- ఫలితాలను రిలీజ్ చేసిన టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లా ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మొత్తం 72.96 శాతం మంది క్వాలిఫై అయ్యారు. హైదరాబాద్‌లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ఓయూ వీసీ కుమార్ మొలుగరంతో కలిసి కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి లాసెట్ ఫలితాలను విడుదల చేశారు. గతనెల 18న జరిగిన పరీక్షలకు మొత్తం 54,374 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 39,673 మంది (72.96 శాతం) అర్హత సాధించారు. పురుషులు 36,117 మందికి 26,878 మంది, అమ్మాయిలు 18,248 మందికి 12,788 మంది క్వాలిఫై అయ్యారు.
ఇక, మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో 38,261 మంది పరీక్ష రాయగా, 29,327 మంది (76.65%) క్వాలిఫై అయ్యారు. ఇంటర్ తర్వాత చేరే ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో 11,520 మందికి 6,073 మంది (52.72%) అర్హత సాధించారు. ఇక ఎల్‌ఎల్‌ఎం కోర్సులో 4,593 మందికి 4,273 (93.03%) మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా, క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ https://lawcet.tgche.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు లేవని, ఇతరులకు లాసెట్‌లో 35 శాతం, పీజీఎల్ సెట్‌లో 25 శాతం మార్కులు వస్తేనే ర్యాంకు కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో కౌన్సిల్ వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
చదువుకు వయసుతో పనిలేదు
చదువుకోవడానికి వయసుతో పనిలేదని లాసెట్ అభ్యర్థులు నిరూపించారు. కేవలం యువత మాత్రమే కాకుండా, పదవీ విరమణ చేసిన వారు, వృద్ధులు కూడా లా కోర్సులు చదివేందుకు పరీక్ష రాశారు. మూడేండ్ల ఎల్ఎల్ బీలో 60 ఏండ్లు పైబడిన వారు మొత్తం 425 మంది పరీక్ష రాయగా, అందులో 348 మంది క్వాలిఫై అయ్యారు. మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో 16 – 22 ఏండ్లలోపు 3,416 మంది రాస్తే 2,476 మంది, 31-– 40 ఏండ్ల వయసున్న వారు అత్యధికంగా 11,432 మంది అర్హత సాధించారు. ఎల్‌ఎల్‌ఎం కోర్సులో అడ్మిషన్లకు 60 ఏండ్లు పైబడిన వారు 89 మంది రాస్తే, 82 మంది క్వాలిఫై అయ్యారు. చిత్రంగా ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు చదివేందుకు 30 మంది పరీక్ష రాయగా, 21 మంది అర్హత సాధించారు.
