గంగుల గ్రానైట్​ కంపెనీకి 360 కోట్ల పెనాల్టీ

గంగుల గ్రానైట్​ కంపెనీకి 360 కోట్ల పెనాల్టీ
  • ఇన్నాళ్లూ తాను చట్టబద్ధంగా గ్రానైట్​బిజినెస్​ చేస్తున్నట్లు చెప్పుకొచ్చిన మంత్రి
  • ఇప్పుడు ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్స్​లోనే భారీగా బయటపడ్డ అక్రమాలు
  • కరీంనగర్​ జిల్లాలో తొమ్మిది క్వారీల నుంచి రూ. 750 కోట్లు వసూలు చేయాలని గనుల శాఖకు ఈడీ ఆదేశాలు

కరీంనగర్, వెలుగు: మంత్రి గంగుల కమలాకర్​కు చెందిన గ్రానైట్​ కంపెనీకి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ రూ. 360 కోట్ల పెనాల్టీ వేసింది. అక్రమంగా గ్రానైట్​తవ్వి, తరలించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఇన్నాళ్లూ తాను చట్టబద్ధంగా గ్రానైట్​ బిజినెస్​ చేస్తున్నానని చెప్పుకొచ్చిన మంత్రి గంగుల​ఇప్పుడు ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది.  గ్రానైట్​తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కరీంనగర్ ఎంపీ, బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​, పలు స్వచ్ఛంద సంస్థల  ఫిర్యాదు మేరకు ఈడీ రంగంలోకి దిగింది. ఏపీ, తమిళనాడులోని వివిధ పోర్టుల్లో ​ఫీల్డ్​ ఎంక్వైరీ చేసి, గ్రానైట్​ తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిగ్గుతేల్చింది. కరీంనగర్​ జిల్లాలో గనులశాఖ ఇచ్చిన అనుమతులకు మించి గ్రానైట్​ను తవ్వి, తరలించడం ద్వారా ప్రభుత్వానికి రూ. 124.94 కోట్ల సీనరేజీ ఎగబెట్టిన తొమ్మిది గ్రానైట్ ఏజెన్సీలకు బుధవారం నోటీసులు ఇచ్చింది. ఈ సీనరేజీతో పాటు దానికి ఐదు రెట్లు కలిపి రూ.749.66 కోట్ల ఫైన్​ వేసింది. ఇందులో మంత్రి గంగుల కమలాకర్​కు  చెందిన శ్వేత గ్రానైట్​కే  ఏకంగా రూ. 360 కోట్ల పెనాల్టీ వేయడం అధికార పార్టీ టీఆర్​ఎస్​లో కలకలం రేపుతోంది. అక్రమాల్లో మంత్రి గంగుల కమలాకర్​కు చెందిన శ్వేత గ్రానైట్స్​ ముందు వరుసలో ఉంది.  గ్రానైట్​ ఏజెన్సీలకు నోటీసులు జారీచేయడంతో పాటు అక్రమ మైనింగ్​కు పాల్పడ్డ ఏజెన్సీల నుంచి సీనరేజీతో పాటు పెనాల్టీ వసూలు చేయాలని గనుల శాఖను ఈడీ ఆదేశించింది. 
రూ. 124.94 కోట్ల సీనరేజీ ఎగవేత
కరీంనగర్​ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్​ ఫ్యామిలీకి చెందిన శ్వేత గ్రానైట్స్​తోపాటు మరో 8 గ్రానైట్​ కంపెనీలు 2008 నుంచి 2011 వరకు అక్రమ మైనింగ్​కు పాల్పడ్డాయి. గనుల శాఖ నుంచి పర్మిషన్​ పొందిన దానికంటే ఎక్కువ గ్రానైట్​ను విదేశాలకు ఎగుమతి చేశాయి. దీంతో  ప్రభుత్వానికి సీనరేజీ రూపంలో రూ. 124.94 కోట్ల దాకా ఎగవేశాయి. ఈ విషయంపై అప్పట్లో ఫిర్యాదులు వెళ్లినా నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 2019లో పలువురు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్​కే చెందిన వైఎస్సార్ సీపీ నేత సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి , లాయర్ ​భేతి మహేందర్​ తదితరులు ఈడీ, సీబీఐకి కంప్లెయింట్​ ఇచ్చారు. దీంతో ఆయా కంపెనీలు ఎంత పరిమాణంలో గ్రానైట్​ విదేశాలకు ఎగుమతి చేశారో వివరాలు తీసుకున్న ఈడీ ఆఫీసర్లు ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, వైజాగ్​ పోర్టుల వద్ద ఉన్న రికార్డులతో పోల్చి చూశారు. ఈ సందర్భంగా గ్రానైట్​ కంపెనీలు చెప్పిన లెక్కలకు, ఫీల్డ్ ​లెవల్​లో ఉన్న లెక్కలకు భారీ తేడా ఉండడంతో అక్రమాలు జరిగినట్లు తేల్చారు.