కోల్ బెల్ట్ ప్రాంత కార్మికులు ఆశీర్వదించిన వారే అధికారంలోకి వస్తారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని ఓసిపి-3 ప్రాజెక్టును కవిత సందర్శించారు. క్షేత్రస్థాయికి వెళ్లి కార్మికులను స్వయంగా కలిసిన ఆమె, వారి కష్టసుఖాలను, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
హెచ్ఎంఎస్ (HMS) సంఘంతో కలిసి సింగరేణి కార్మికుల సొంతింటి కలను కచ్చితంగా నెరవేరుస్తామని కవిత భరోసా ఇచ్చారు. గతంలో కార్మికులు కోల్పోయిన హక్కులను మళ్లీ తిరిగి తీసుకువస్తామని, సింగరేణిలో తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి డిపెండెంట్ ఉద్యోగాల ప్రక్రియను పునరుద్ధరిస్తామని కీలక ప్రకటన చేశారు.
ఇదే సమయంలో ఇతర కార్మిక సంఘాలపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మిగతా సంఘాలు సమస్యలపై కేవలం ప్రశ్నించి వదిలేస్తాయే తప్ప.. పరిష్కారం చూపవని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎఐటియుసి (AITUC), ఐఎన్టీయుసి (INTUC) సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.ఈ సమావేశం ముగిసిన అనంతరం కవిత కార్మికులతో కలిసి మైనింగ్ క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేశారు. సాధారణ కార్మికురాలిలా వారితో కలిసి కూర్చుని టిఫిన్ చేశారు.
