ఇందిరా పార్క్​ వద్ద నిరుద్యోగుల ధర్నా

ఇందిరా పార్క్​ వద్ద నిరుద్యోగుల ధర్నా

ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని టీఎస్​పీఎస్సీ అభ్యర్థులు అన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించినా.. రిజల్ట్స్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఏఈఈ, గ్రూప్ 4, జేఎల్ ఫలితాలు విడుదల చేయాలన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులంతా కలిసి శనివారం ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్​లో నిరసన తెలిపారు. తర్వాత పలువురు అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. టీఎస్​పీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో నిలిచిపోయిందన్నారు. కొన్ని పోస్టులకు పరీక్షలు పూర్తయినా ఫలితాలు ప్రకటించలేదని తెలిపారు. ఇవన్నీ టీఎస్​పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటుతో ముడిపడి ఉందన్నారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించాలని కోరారు. వెంటనే కొత్త బోర్డును నియమించి న్యాయం చేయాలన్నారు. రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి ఏఈఈ, గ్రూప్ 4 ఫలితాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. ధర్నాలో అభ్యర్థులు సాయి తేజ, కావ్య, రాధిక, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

జీవో నంబర్ 45 రద్దు చేయాలి

జీవో నంబర్ 45 రద్దు చేసి పాత పద్ధతిలోనే  ఐటీ, కమ్యూనికేషన్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాట సమితి శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు కాంగ్రెస్ సీనియర్ లీడర్ బక్క జడ్సన్ మద్దతు తెలిపి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్టూడెంట్ల బతుకులు ఆగం చేసిందన్నారు. జీవో నంబర్ 46 తీసుకొచ్చి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కానిస్టేబుల్ అభ్యర్థుల మధ్య చిచ్చుపెట్టిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం సరి చేసి న్యాయం చేస్తున్నదని తెలిపారు. పాత పద్ధతి ప్రకారమే పోస్టులు భర్తీ చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు కోరారు. నిరసన దీక్షలో బీజేవైఎం నేతలు రాజు, అన్వర్, రమేశ్, నాగరాజు, కానిస్టేబుల్ అభ్యర్థులు నవీన్, ఉదయ్, అనిల్, ప్రవీణ్, అశోక్, మహేశ్, మధు 
తదితరులు పాల్గొన్నారు.